అనంతపురం ఎడ్యుకేషన్: రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన హత్యాయత్నాన్ని అనంతపురం జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం (ఏడీపీఎస్‌ఏ) తీవ్రంగా ఖండించింది. శనివారం సంఘం నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల్లో పెరుగుతున్న ఆవేశపూరిత ప్రవర్తన, హింసాత్మక ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పిల్లలకు విద్యను అందించడంతోపాటు విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, పరస్పర గౌరవం, మానవీయతను పెంపొందించాల్సిన బాధ్యత విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, సమాజంపై ఉందన్నారు. ముఖ్యంగా విద్యాసంస్థల్లో బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ. గోపాల్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. చంద్రశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే. రమణరెడ్డి, గౌరవ సలహాదారు కే. రామాంజనేయులు, కోశాధికారి రామచంద్ర, ఉపాధ్యక్షుడు ఎస్. రాఘవేంద్ర, నగర అధ్యక్షుడు జీ. భాస్కర్‌రెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి కే. విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
విద్యార్థినిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : వైఎస్సార్‌టీఏ
రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడిని ఏపీవైఎస్‌ఆర్‌టీఏ అనంతపురం జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. జిల్లా అధ్యక్షుడు ఎస్. నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గౌడ్ ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థినిపై పైశాచికంగా దాడి చేయడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనకు కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రేపు కరువు బృందం పర్యటన
ఆత్మకూరు: మండలంలోని పంపనూరు గ్రామంలో సోమవారం కేంద్ర బృందం పర్యటించనున్నట్లు ఏఓరి జ్యోతు విజయ్‌కుమార్ శనివారం తెలియజేశారు. బృందం కరువు పరిస్థితులను అధ్యయనం చేస్తుందన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పాడి రైతులు, గ్రామీణ ఉపాధి, జోవనోపాధి మిషన్‌కు సంభందించిన వారు పాల్గొనాలని కోరారు.
ఆర్టీసీ డ్రైవర్‌కు దేహశుద్ధి
ఉరవకొండ: ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆర్టీసీ డ్రైవర్‌కు యువతి తరఫు బంధువులు దేహశుద్ధి చేసిన ఘటన శనివారం ఉరవకొండ డిపో వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. కూడేరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి అనంతపురంలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె రోజు ఉరవకొండ డిపోకు చెందిన బస్సులో ప్రయాణం సాగిస్తోంది. యువతితో మాటల పరిచయం పెంచుకున్న ఆర్టీసీ డ్రైవర్ బాబా శనివారం ఉదయం అనంతపురం ఆర్టీసీ డిపో ఆవరణలో ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సంప్రదించగా అనంతపురం 3వ పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు సైతం ఉరవకొండ ఆర్టీసీ డిపోకు చేరుకుని ప్రయాణికుల సమక్షంలోనే డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు.
నిందితుడు డ్రైవర్ బాబా, దేహశుద్ధి చేస్తున్న అమ్మాయి కుటుంబ సభ్యులు


