అమిలినేని సారూ.. గుక్కెడు నీరివ్వరూ | - | Sakshi
Sakshi News home page

అమిలినేని సారూ.. గుక్కెడు నీరివ్వరూ

Oct 8 2026 12:36 AM | Updated on Oct 8 2026 12:36 AM

కళ్యాణదుర్గం (కంబదూరు): ఎమ్యెల్యే సారూ.. మా ఊర్లో కనీసం తాగేందుకు గత రెండు నెలలుగా గుక్కెడు నీళ్లు లేవు. ఓ సారి మా ఊరి వైపు వచ్చి మా బాధలు చూసి తాగునీరు ఇవ్వాలని కంబదూరు మండలం చెన్నంపల్లి గ్రామస్తులు, మహిళలు బుధవారం రోడ్డెక్కారు. మా సమస్యను పంచాయతీ అధికారులు, పాలకులకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల పర్యటనప్పుడు గొప్పలు చెప్పే పాలకులు నీటి ఇక్కట్లు పడుతున్నప్పుడు ఏమైపోయారంటూ మహిళలు నిలదీస్తున్నారు. ఇప్పటికై నా గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ మాజీ జెడ్పీటీసీ గుద్దెళ్ల నాగరాజు డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ షాక్‌తో

యువకుడి మృతి

బ్రహ్మసముద్రం: విద్యుత్‌ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని ముప్పకుంట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. మండల పరిధిలోని ముప్పలకుంటకు చెందిన చాపిరి ఎర్రిస్వామి పిండిమిషన్‌ పెట్టుకుని తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో మిషన్‌ ఆన్‌ చేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతిడికి రెండేళ్ల క్రితమే అదే గ్రామానికి చెందిన వెన్నెల అనే యువతితో వివాహం జరిగింది. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బ్రహ్మసముద్రం ఎస్‌ఐ సాయికుమార్‌ తెలిపారు.

‘ఎఫ్‌ఎఫ్‌ఎస్‌’లోనే ఎరువుల సరఫరా, పంపిణీ

● యాప్‌పై సిబ్బందికి అవగాహన కల్పించిన జేడీఏ సాలురెడ్డి

అనంతపురం అగ్రికల్చర్‌: ఎరువుల సరఫరా, పంపిణీ, నియంత్రణకు సంబంధించి ప్రస్తుత రబీ సీజన్‌ నుంచి కొత్త యాప్‌ అందుబాటులోకి వచ్చిందని జేడీఏ ఎన్‌.సాలురెడ్డి తెలిపారు. యాప్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా బుధవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏఓలు, ఏడీఏలకు నిర్వహించిన శిక్షణలో జేడీఏతో పాటు కమిషనరేట్‌ నుంచి వచ్చిన టెక్నికల్‌ ఏఓ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్స్‌ సేల్స్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌) యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు. అందులో జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా రైతుల వివరాలు, భూమి, పంటల సాగు తదితర వివరాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. పంట ఆధారంగా ఎంత మోతాదులో యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌లు అవసరమనేది తెలుస్తుందన్నారు. ప్రతి రైతుకూ ఎరువులు అందేలా చర్యలు తీసుకోవచ్చన్నారు. యాప్‌కు సంబంధించి విషయ పరిజ్ఞానం పెంపొందించుకుని ఈ రబీ నుంచి పటిష్టంగా పారదర్శకంగా ఎరువుల సరఫరా, పంపిణీ కొనసాగించాలని ఆదేశించారు.

పీఎండీఎస్‌తో

ఆశాజనక ఫలితాలు

రాప్తాడు రూరల్‌: వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ పెల్లైటెజ్డ్‌ పీఎండీఎస్‌ ద్వారా ఆశాజనక ఫలితాలు సాధించవచ్చని రైతు రాజు క్షేత్రం నిరూపిస్తోందని ఏపీసీఎన్‌ఎఫ్‌–రైస్‌ ఈవీసీ, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి టి.విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. డీపీఎం లక్ష్మానాయక్‌తో కలిసి ఆయన బుధవారం అనంతపురం రూరల్‌ మండలం కందుకూరులో రాజు అనే రైతు 16 ఎకరాల్లో చేపట్టిన వర్షాధార మామిడి తోటలోని పెల్లైటెజ్డ్‌ పీఎండీఎస్‌ క్షేత్రాన్ని సందర్శించారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ ప్రకృతి విధానంతో మొలకలు రావడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసి, రైతును అభినందించారు. అనంతరం అనంతపురంలోని ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌లో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన పలువురు రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో విజయ్‌కుమార్‌ ముఖాముఖిగా చర్చించారు. ప్రస్తుతం రైతులు సాగు చేసిన పంట పరిస్థితి, పీఎండీఎస్‌ విధానం వల్ల కలుగుతున్న ప్రయోజనాలు, రైతుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో వర్షాభావం నేపథ్యంలో పంటను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. తక్కువ వర్షపాతం ఉన్నా ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నమ్మకంతో సాగును కొనసాగించాలని, క్షేత్రస్థాయిలో లభించిన అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సీనియర్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్లు పవన్‌ ముంతా, డాక్టర్‌ నవీన్‌, రెండు జిల్లాలకు చెందిన రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement