ఎంఎస్‌సీ ఎన్నికల్లో ‘పచ్చ’ పన్నాగం | - | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌సీ ఎన్నికల్లో ‘పచ్చ’ పన్నాగం

Sep 30 2026 12:16 AM | Updated on Sep 30 2026 12:16 AM

● చైర్మన్‌ స్థానాల కోసం పట్టు

● కోరం ఉన్నా కొన్ని చోట్ల ఎన్నికల వాయిదా

● జిల్లా వ్యాప్తంగా 1,723 పాఠశాలల్లో ఎన్నికలు.. 1,687 చోట్ల పూర్తి

అనంతపురం ఎడ్యుకేషన్‌: స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికల్లో అధికార పార్టీ అనుకున్నట్టే చేసింది. మంగళవారం జరిగిన ఎస్‌ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు తమకు అనుకూలమైన వారిని చైర్మన్లుగా చేసుకునేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకున్నారని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనుకూలంగా లేని వ్యక్తులు పోటీలో నిలబడిన చోట్ల కోరం ఉన్నప్పటికీ ఎన్నికలను వాయిదా వేయించారని వాపోతున్నారు. కొన్ని చోట్ల పోలీసులను రంగంలోకి దించి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,723 పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 1,687 పాఠశాలల్లో పూర్తయ్యాయి. 36 పాఠశాలల్లో వాయిదా పడ్డాయి. వీటిలో 27 చోట్ల కోరం లేకపోవడం, 9 చోట్ల శాంతిభద్రతల సమస్య కారణంగా వాయిదా వేశారు.

కోరం ఉన్నా.. వాయిదా

తమకు అనుకూలంగా లేని చోట్ల కోరం ఉన్నప్పటికీ ఎన్నికలు జరగకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధుల నుంచి హెచ్‌ఎంలు, ఎంఈఓలు, జిల్లాస్థాయి అధికారుల వరకు ఒత్తిళ్లు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో కొందరు హెచ్‌ఎంలు, ఎంఈఓలకు సాయంత్రం వరకు ఎన్నికల నిర్వహణ కంటే ఈ సమస్యలను చక్కదిద్దడమే పనిగా మారింది.

‘మావాళ్లే’ ఉండాలంటూ ఒత్తిళ్లు

అనంతపురం రూరల్‌ మండలంలోని పలు పాఠశాలల్లో కొందరు టీడీపీ నాయకులు నేరుగా జోక్యం చేసుకున్నారు. ‘ఎవరెవరు పోటీలో నిలబడుతున్నారు? వారు మావారో కాదో చూస్తాం. మావారు కాకపోతే కొత్తవారిని నిలబెడతాం’ అంటూ హెచ్‌ఎంలపై ఒత్తిళ్లు తెచ్చారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

● నార్పల మండలం బండ్లపల్లిలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడికి సంఖ్యాబలం ఎక్కువగా ఉండటాన్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. కోరం ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ఆలస్యం చేసి చివరకు పోలీసుల ద్వారా వాయిదా వేయించారని తల్లిదండ్రులు చెబుతున్నారు. దుగుమర్రి పాఠశాలలో అధికార పార్టీ వర్గాల మధ్య ఆధిపత్యపోరు తలెత్తి వాగ్వాదానికి దారితీసింది. కోరం ఉన్నప్పటికీ పోలీసుల ద్వారా ఎన్నికలను వాయిదా వేయించారని ఆరోపిస్తున్నారు. ఇదే మండలం కర్ణపుడికిలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొని ఎన్నిక వాయిదా పడింది.

● శింగనమల మండలం పెరవలి జెడ్పీహెచ్‌ఎస్‌లో టీడీపీ నాయకుడు హల్‌చల్‌ చేశాడు. తన వర్గానికి మద్దతు లేకపోవడంతో అదే పార్టీలోని ప్రత్యర్థి వర్గంతో ఘర్షణకు దిగాడు. కోరం ఉన్నప్పటికీ వర్గపోరు కారణంగా ఎన్నిక వాయిదా పడింది.

అనేక పాఠశాలల్లో అధికార పార్టీ నేతల జోక్యంతో తల్లిదండ్రులు నామమాత్రంగా హాజరయ్యారు. మరోవైపు అధికార టీడీపీలోని వర్గాల మధ్య ఆధిపత్యపోరు కూడా ఎన్నికలను ప్రభావితం చేసింది. తమ వర్గానికి చెందిన వ్యక్తే చైర్మన్‌ కావాలంటూ పట్టుబట్టడంతో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నార్పలలోని బీసీ గురుకుల పాఠశాలలో కొందరు టీడీపీ నాయకులు వచ్చి హంగామా చేయడంతో తల్లిదండ్రులు తిరగబడ్డారు. ‘బయటి వ్యక్తులు పాఠశాలలోకి ఎలా వస్తారు?’ అంటూ నిలదీశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎన్నికలను వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement