భలే పనిచేస్తున్నారు సార్‌... | - | Sakshi
Sakshi News home page

భలే పనిచేస్తున్నారు సార్‌...

Sep 30 2026 12:16 AM | Updated on Sep 30 2026 12:16 AM

● పనిచేయని కలెక్టర్‌, జేసీలకు సన్మానమంటూ వినూత్న నిరసన

అనంతపురం అర్బన్‌: ఎవరైనా బాగా పనిచేస్తే సన్మానిస్తారు. వారిని చూసి మరికొందరు బాగా పనిచేస్తారని భావిస్తారు. కానీ అనంతపురంలో ఫైట్‌ ఫర్‌ రైట్స్‌ సంస్థ కలెక్టర్‌, జేసీలను ‘పని’మంతులంటూ పేర్కొంటూ వినూత్నంగా సన్మానం చేసేందుకు సిద్ధమైంది. ‘ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కలెక్టర్‌ ఆనంద్‌, జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ విఫలమయ్యారు. విధులను సరిగా నిర్వర్తించని వారిద్దరినీ సన్మానం చేయదలిచాం’ అంటూ ఫైట్‌ ఫర్‌ రైట్స్‌ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫొటోతో ఉన్న మెమొంటోలకు శాలువాతో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కేపీ రాజు, ప్రజాసంఘాల నాయకులు మంగళవారం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడుకుని కార్యాలయం గేట్లను మూసివేయించారు. దీంతో నాయకులు కలెక్టరేట్‌ గేటు ముందు బైఠాయించారు. మెమొంటోలకు శాలువా కప్పి కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్‌ఓ, పరిపాలనాధికారి... బయటికి వచ్చి తమ సన్మానం స్వీకరించాలి’ అని కోరారు. ఎంతసేపటికీ నిరసన విరమించకపోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిరసన సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పరిష్కార వేదికలో ప్రజలు చెప్పుకుంటున్న సమస్యలను దిగువస్థాయి అధికారులకు పంపడంతోనే కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ సరిపెడుతున్నారన్నారు. సమస్య పరిష్కారం అయ్యిందా లేదా అనేది పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఏడాది మార్చిలో 10వ తరగతిలో వెనకబడిన శారద నగర పాలక పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థినులను కురుగంట కేజీబీవీలో చేర్పించారని, అయితే వారికి భోజన వసతి కల్పించకపోవడంతో పిల్లలు వెనక్కు వెళ్లిపోయారన్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ విచారణ చేయించాలని కోరామన్నారు. విచారణ చేసిన డీవైఈఓ తప్పుడు నివేదిక ఇచ్చారన్నారు. దాన్ని కలెక్టర్‌ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. అనంతరం పోలీసులు వచ్చి ఆందోళనకారులను అరెస్టు చేశారు.

అర్హులకు ‘సంక్షేమ’ ఫలాలు

అందేలా చూడాలి

ఆత్మకూరు: ముట్టాల గ్రామంలో మంగళవారం ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణానికి ట్రైనీ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సుయాజ్‌ కుమార్‌ భూమిపూజ చేశారు. అనంతరం సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించడంతో పాటు సిబ్బంది హాజరు శాతాన్ని పరిశీలించా,రు. సమయ పాలన పాటించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నాగకృష్ణయ్య, పీడీఓ ఉపేంద్ర, ఏపీఓ వెంకటనారాయణ, పంచాయతీ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement