ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయతకు విఘాతం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయతకు విఘాతం

Sep 30 2026 12:16 AM | Updated on Sep 30 2026 12:16 AM

అనంతపురం: ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలా నిలవాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయతకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ విఘాతం కలిగించారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న లోపాలు, ఎలెక్షన్‌ కమిషన్‌ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘంలో సహచరులను ఖాతరు చేయకుండా సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా చేర్పింపులు, తొలగింపులు (ఫారం–6), ఐటీ డేటాబేస్‌ సవరణలకు సంబంధించి కీలక నిర్ణయాలు తమకు తెలియకుండానే జరిగాయని ఇతర కమిషనర్లు గత 10 నెలల కాలంలో 14 సార్లు అభ్యంతరాలు తెలిపినా పట్టించుకోలేదన్నారు. బెంగాల్‌, బిహార్‌, హర్యాన, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ (సర్‌) ప్రక్రియ అత్యంత వివాదాస్పదంగా మారిందన్నారు. బిహార్‌లో ఏకంగా 60 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగిస్తే, ఆ విషయమే తనకు తెలియదని ఒక ఎన్నికల కమిషనర్‌ వెల్లడించడం ఈసీలోని లొసుగులకు అద్దం పడుతోందన్నారు. తక్షణమే జ్ఞానేష్‌కుమార్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఓటింగ్‌ ప్రక్రియలో వ్యత్యాసాలు

2024 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ’ఓట్‌ ఫర్‌ డెమోక్రసీ’ సంస్థ, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌ వెల్లడించిన లెక్కలను విశ్వేశ్వరరెడ్డి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ రోజు ప్రకటించిన ఓటింగ్‌ శాతానికి, రెండు రోజుల తర్వాత ప్రకటించిన సంఖ్యకు ఏకంగా 12.54% తేడా వచ్చిందని, ఇది దేశ చరిత్రలోనే అసాధారణమైన విషయమని పేర్కొన్నారు. ఏపీలోని 3,500 పోలింగ్‌ కేంద్రాల్లో రాత్రి 11:40 నుండి 2:00 గంటల మధ్య కేవలం రెండు గంటల సమయంలోనే 17 లక్షల ఓట్లు పోలవ్వడం, నిమిషానికి ముగ్గురు ఓటు వేసినట్లు చూపడం వెనుక పెద్ద కుట్ర ఉందనిలాయన వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రాష్ట్రంలోని 87 శాతం మంది ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించారని, అయినప్పటికీ వచ్చిన ఎన్నికల ఫలితాలను గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం ఇప్పటికీ నమ్మలేకపోతున్నారని అన్నారు. ఈవీఎంలలో ఏదో లోపం జరిగిందనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ ఉందన్నారు. జ్ఞానేష్‌ కుమార్‌ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాయలసీమ రీజియన్‌ అధికార ప్రతినిధి కేవీ రమణ, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న తదితరులు పాల్గొన్నారు.

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌వి ఏకపక్ష నిర్ణయాలు

తక్షణమే రాజీనామా చేయాలి

ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలి

ఈవీఎంలపై ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలు

వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement