అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ల కొరత వేధిస్తోంది. రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేక ఇన్‌చార్జ్‌లతోనే పాలన సాగిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్లే ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్లుగా కొనసాగుతున్నారు. దీంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటే.. అందులో 7 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేరు. శ్రీసత్యసాయి జిల్లాలో రెండు చోట్ల ఇన్‌చార్జ్‌లే. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సీనియర్ అసిస్టెంట్లతోనే నడుస్తున్నాయి.
ప్రధాన కార్యాలయానికే దిక్కులేదు..
అనంతపురం జిల్లా కేంద్రంలోని రామ్‌నగర్ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు ఉండాల్సి ఉండగా.. ఒక్కరూ లేరు. ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్‌కే అదనపు బాధ్యతలు అప్పగించారు. అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ సీనియర్ అసిస్టెంటే ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్నారు. తాడిపత్రి, గుత్తి, కణేకల్లు, శింగనమల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సైతం ఇదే పరిస్థితి. శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇద్దరు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు ఉండాల్సి ఉండగా ఒక్కరూ లేరు. దీంతో సీనియర్ అసిస్టెంటే అన్నీ చూసుకోవాల్సి వస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయమైన బుక్కపట్నంలో సైతం సీనియర్ అసిస్టెంటేతోనే రిజిస్ట్రేషన్ పక్రియను కొనసాగిస్తున్నారు.
సీనియర్ అసిస్టెంట్ల ఇష్టారాజ్యం
రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేకపోవడంతో సీనియర్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. స్థిరాస్తుల క్రయ, విక్రయాలతోపాటు రిజిస్ట్రేషన్ సేవలను వినియోగించుకునేందుకు వచ్చే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. చిన్న పనికి సైతం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో తొమ్మిది చోట్ల సబ్‌రిజిస్ట్రార్ల కొరత
సీనియర్ అసిస్టెంట్లకే ఇన్‌చార్జ్‌గా అదనపు బాధ్యతలు


