తెల్లారగానే తెగిన పుస్తెల గొలుసులు | - | Sakshi
Sakshi News home page

తెల్లారగానే తెగిన పుస్తెల గొలుసులు

Sep 30 2026 12:16 AM | Updated on Sep 30 2026 12:16 AM

చిమ్మచీకటి వీడి అప్పుడప్పుడే తెలవారుతోంది.. జనం అంతా నిద్రలేచారు..రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యారు.. కొన్నిచోట్ల మహిళలు కిరాణా దుకాణాలు తెరుస్తున్నారు... ఇంటి సరుకులు తెచ్చుకునేందుకు కొందరు మహిళలు కిరాణా దుకాణాల వద్దకు నడిచి వెళ్తున్నారు.. ఇంకొన్నిచోట్ల మహిళలు, వృద్ధులు వాకింగ్‌ చేస్తున్నారు.. ఇదే అదునుగా చూసిన దుండగులు పల్సర్‌ బైక్‌పై వచ్చి.. మహిళల పుస్తల గొలుసులు లాక్కెళ్లారు.. అనంతపురం నగరం, బుక్కరాయసముద్రం, రాప్తాడు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఒకేరోజు వరుస చైన్‌ స్నాచింగ్‌లు జనాన్ని కలవరపెట్టాయి.

● ఒకేరోజు ఐదు చోట్ల బంగారు గొలుసుల దొంగతనాలు

● పల్సర్‌ బైక్‌పై వచ్చి దుండగుల హల్‌చల్‌

● పోలీసు నిఘా వ్యవస్థపై ప్రజల విమర్శలు

అనంతపురం సెంట్రల్‌: జిల్లా కేంద్రం, బుక్కరాయసముద్రం, రాప్తాడు పరిసర మండలాల్లో చైన్‌స్నాచర్లు చెలరేగిపోయారు. మంగళవారం ఉదయం 5.15 గంటలకు చైన్‌స్నాచింగ్‌లు ప్రారంభించి, 8 గంటల కల్లా పని ముగించేశారు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు అగంతకులు పల్సర్‌ బైకులో తిరుగుతూ మొత్తం నలుగురు మహిళల మెడల్లోని బంగారు గొలుసులు అపహరించుకొని వెళ్లారు.

● బుక్కరాయసముద్రం మండలం వడియంపేటలో ప్రారంభించి వీరభద్రకాలనీ, వినాయక్‌నగర్‌, సాయినగర్‌, రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లిలో వరుసగా దొంగతనాలకు పాల్పడ్డారు. నాలుగు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడింది ఆ ఇద్దరే కావడం గమనార్హం. సుమారు అరగంట వ్యవధిలో ఒక్కో దొంగతనం చేసుకుంటూ వెళ్లారు. తొలుత ఉదయం 5.15 గంటల సమయంలో బుక్కరాయసముద్రం మండలం వడియంపేటలో కిరాణా దుకాణం నడుపుతున్న లక్ష్మి అనే మహిళ అప్పుడప్పుడే దుకాణం తెరిచింది. హెచ్‌పీ గ్యాస్‌ గోడౌన్‌ ఉండడంతో కస్టమర్లు వస్తారనే ఉద్దేశంతో రోజూ 5 గంటలకు తలుపులు తీయడం ఆనవాయితీ. తీసిన వెంటనే వాటర్‌ బాటిల్‌ కావాలని వచ్చిన దుండగులు.. ఆమె మెడలోని 5 తులాల చైన్‌ను లాక్కెళ్లారు. అనంతరం ముసలమ్మ కట్ట సమీపంలోని వీరభద్రకాలనీలో పంపనూరు సుబ్రమణ్యస్వామి దర్శనానికి వెళ్లేందుకు నాగరత్న, ఆమె భర్త ఆదినారాయణ బయల్దేరారు. తెల్లవారుజామున 5.45 గంటల సమయంలో ఓ టీ స్టాల్‌ వద్ద కాపు కాచిన దుండగులు.. మహిళ మెడలోని చైన్‌ను లాక్కున్నారు. ఆసమయంలో సదరు మహిళగా గట్టిగా అడ్డుకోవడంతో గొలుసు కొంతభాగం తెగిపోయింది. సుమారు ఐదు తులాల చైన్‌లో తులం వరకూ దొంగలు ఎత్తుకెళ్లారు. మిగిలిన బంగారు గొలుసు బాధితురాలు గట్టిగా పట్టుకోవడం చేతిలోనే ఉండిపోయింది. అనంతరం వినాయక్‌నగర్‌లో 6.45 గంటల సమయంలో వాకింగ్‌ ముగించుకొని ఇంటికి వెళ్తున్న వృద్ధురాలు విజయమ్మ (భర్త లేట్‌ మణి) మెడలోని 3.5 తులాలు బంగారు గొలుసు లాక్కెళ్లారు. అక్కడి నుంచి సాయినగర్‌ ఆరో క్రాస్‌కు చేరుకొని ఒంటరిగా కిరాణదుకాణానికి వెళ్తున్న శ్యామల అనే మహిళ మెడలోని చైన్‌ లాక్కెళ్లారు. సుమారు మూడున్నర తులం ఉంటుందని బాధితురాలు వాపోయింది.

నిఘా వ్యవస్థ ఎక్కడ ..?

ఒక పల్సర్‌ బైకు వేసుకొని ఇద్దరు దొంగలు చెలరేగిపోయారు. మూడు గంటల వ్యవధిలో ఐదు చోట్ల దొంగనాలకు పాల్పడ్డారు. ఈ దొంగతనాల తీరును చూస్తే అసలు పోలీసు వ్యవస్థ ఉందా..లేదా? అనే అనుమానం కలుగుతోంది. ఏదైనా ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమయ్యే పోలీసు వ్యవస్థ జిల్లాలో లేదని చెప్పడానికి ఈ వరుస దొంగతనాలు నిదర్శనంగా మారాయి. ఎక్కడే కాని దొంగలను నిలువరించే ప్రయత్నం పోలీసుల వైపు నుంచి జరగకపోవడం గమనార్హం. రెండు వారాల క్రితం నాల్గో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఒకేరోజు రెండుచోట్ల దొంగతనాలు జరిగాయి. డీమార్ట్‌ వెనుకవైపున, సోమనాథ్‌నగర్‌లో ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లోని బంగారుచైన్‌ను లాక్కెళ్లారు. అప్పుడు కూడా పల్సర్‌ బైకులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేసినట్లు బాధితులు వాపోయారు. తాజాగా జరిగిన దొంగతనాలను చూస్తే నిందితులు వారేనని స్పష్టమవుతోంది. జిల్లాలో సరైన నిఘా వ్యవస్థలు లేకపోవడం వలన దొంగలపని సులువు అవుతోందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతోంది.

పల్సర్‌బైకులో దొంగలు, సాయినగర్‌లో బాధితురాలి నుంచి వివరాలు సేకరిస్తున్న టూటౌన్‌ పోలీసులు

రంగంలోకి ఐదు టీంలు

నగరంలో మంగళవారం ఉదయం జరిగిన చైన్‌స్నాచింగ్‌ ఘటనలను సీరియస్‌గా తీసుకున్నాం. ఐదు మంది సీఐలతో ఐదు బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే సదరు బృందాలు రంగంలోకి దిగాయి. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. ఎట్టిపరిస్థితిలో వీరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీసులందరూ అదే పనిలో నిమగ్నమయ్యాం. – చంద్రశేఖర్‌, డీఎస్పీ, అనంతపురం

మంగళవారం తెల్లవారు జామునుంచి గొలుసు దొంగతనాలు ఇలా..

ఉదయం 5.15 గంటలకు : బుక్కరాయసముద్రం మండలం వడియంపేటలో కిరాణా దుకాణదారు లక్ష్మి మెడలో 5 తులాల బంగారు చైన్‌ను లాక్కెళ్లారు.

ఉదయం 5.45 గంటలకు : బుక్కరాయసముద్రం మండలం చెరువుకట్ట సమీపంలో వీరభద్ర కాలనీలో నాగరత్న అనే మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు యత్నించారు. సదరు మహిళ గట్టిగా అడ్డుకోవడంతో 5 తులాల చైనులో తులం వరకూ దొంగలు లాక్కెళ్లారు.

ఉదయం 6.45 గంటలకు : అనంతపురం నగరంలోని వినాయకనగర్‌లో వాకింగ్‌ చేస్తున్న వృద్ధురాలు విజయమ్మ మెడలోని గొలుసు అపహరించారు.

ఉదయం 7.18 గంటలకు: సాయినగర్‌ ఆరో క్రాస్‌లో సరుకుల కోసం కిరణా దుకాణం వద్దకు వెళ్తున్న శ్యామల అనే మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement