ఆర్టీసీ టెండర్లకు 871 దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ టెండర్లకు 871 దరఖాస్తులు

Sep 30 2026 12:16 AM | Updated on Sep 30 2026 12:16 AM

అనంతపురం క్రైం: జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో అవుట్‌సోర్సింగ్‌ పనుల కోసం పిలిచిన టెండర్లకు భారీ స్పందన లభించింది. మంగళవారం గడువు ముగిసే సమయానికి 871 దరఖాస్తులు అందాయి. వాటి స్క్రూట్నీ ప్రక్రియ కొనసాగుతోంది. టెండర్ల ప్రక్రియను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ పర్యవేక్షిస్తోంది. డిప్యూటీ సీటీఎం ప్రశాంతి, అకౌంట్స్‌ ఆఫీసర్‌ లక్ష్మీదేవి, తాడిపత్రి డిపో మేనేజర్‌, అనంతపురం డిపో ఇన్‌చార్జ్‌ మేనేజర్‌ వినయ్‌కుమార్‌ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో టెండర్‌ దరఖాస్తుల పరిశీలన, సాంకేతిక అర్హతల నిర్ధారణ, తదుపరి ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది. గుత్తి, గుంతకల్లు డిపోల్లో స్వీపింగ్‌, క్లీనింగ్‌, అటెండర్‌ పనులు, అనంతపురం బస్‌స్టేషన్‌లో విచారణ, ప్రకటనల సిబ్బంది, అనంతపురం, తాడిపత్రి డిపోల్లో మెకానిక్‌లు, శ్రామికులు, రాయదుర్గంలో ఎలక్ట్రీషియన్‌, హ్యామర్‌మ్యాన్‌, కళ్యాణదుర్గంలో టైర్‌ మెకానిక్‌, ఉరవకొండ, కళ్యాణదుర్గంలో కోచ్‌బిల్డర్లు, పలు డిపోల్లో బస్సుల శుభ్రత పనులకు టెండర్లు పిలిచారు. టెండర్లలో పీఎఫ్‌, ఈఎస్‌ఐ, లేబర్‌ లైసెన్స్‌ తదితర అర్హతలను తప్పనిసరి చేశారు.

శాంతినారాయణకు

జానమద్ది పురస్కారం

అనంతపురం కల్చరల్‌: జిల్లాకు చెందిన సీనియర్‌ రచయిత డాక్టర్‌ శాంతినారాయణకు సాహిత్యంలో విశేష కృషి చేస్తున్న వారికందించే జానమద్ది పురస్కారాన్ని అందించనున్నట్లు జానమద్ది సాహితీపీఠం గౌరవ సలహాదారులు డాక్టర్‌ కేవీ రమణాచారి, డాక్టర్‌ మండలి బుద్ధప్రసాద్‌, సాహితీపీఠం మేనేజింగ్‌ ట్రస్టీ జానమద్ది విజయభాస్కర్‌ తెలిపారు. ఆరు దశాబ్దాలుగా కథ, నవలా రచయితగానే కాకుండా విమలాశాంతి, సాంస్కృతిక, సాంఘిక సేవా సమితి ద్వారా ఎంతో మంది రచయితలు, కవులను ఆయన ప్రోత్సహిస్తున్నారన్నారు. గతంలోనూ జిల్లా రచయితల సంఘం ద్వారా ‘అనంత’ సాహిత్య ప్రచారానికి విశేష సేవలందించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో శాంతి నారాయణ డాక్టర్‌ వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. డాక్టర్‌ శాంతినారాయణ వచ్చేనెల 25న వైఎస్సార్‌ కడప జిల్లా బ్రౌన్‌ గ్రంథాలయంలో జరగనున్న పురస్కార ప్రదానోత్సవంలో అవార్డుతో పాటు రూ.10 వేల నగదు అందుకోనున్నారు.

డోలమైట్‌ మైనింగ్‌పై

ప్రజాభిప్రాయ సేకరణ

యాడికి: మండలంలోని చందన గ్రామ సమీపంలో షిర్డీ సాయి మినరల్స్‌ ఆధ్వర్యంలో 328 బీ,పీ సర్వే నంబరులోని 4.95 హెక్టార్ల విస్తీర్ణంలో చేపట్టనున్న డోలమైట్‌ మైనింగ్‌ ప్రాజక్టుకు సంబంధించి మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. గుంతకల్లు ఆర్డీఓ శ్రీని వాసులు, తహసీల్దార్‌ ప్రతాప్‌ రెడ్డి, కాలుష్య నియంత్రణ కమిటీ చైర్‌పర్సన్‌ శశికళ హాజరై మాట్లాడారు. చందన, దైవాలమడుగు, సమీప వ్యవసాయ రైతులు మాట్లాడుతూ మైనింగ్‌లో ఓవర్‌ బ్లాస్టింగ్‌ చేయడంతో పొలాల వద్దకు కూలీలు రావడం లేదని, భూగర్భజలాలు అడుగంటుతున్నాయన్నారు. దీంతో ఇబ్బందులకు గురవుతున్నామని అధికారుల దృష్టికి తెచ్చారు. పంట పొలాలు దెబ్బతినకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా మైనింగ్‌లో బ్లాస్టింగ్‌ చేస్తామని గని యజమాని అధికారులకు తెలియజేశారు. సమీప వ్యవసాయ రైతులకు, గ్రామాల్లో ప్రజలకు, పాఠశాలలో విద్యార్థులకు నీరు, వైద్యం తదితర సమస్యలు రాకుండా చూడాలని ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్‌ ప్రతాప్‌ రెడ్డి మైనింగ్‌ యజమానిని ఆదేశించారు. కార్యక్రమంలో చందన, లక్షుంపల్లి వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

‘బంగారు గొలుసు అని రోల్డ్‌ గోల్డ్‌ లాక్కెళ్లాడు’

రాప్తాడు రూరల్‌: రాప్తాడు మండలం చిన్మయనగర్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు అని బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు లాక్కొని ఉడాయించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాలు..చిన్మయానగర్‌ వాటర్‌ ట్యాంక్‌ వద్ద లక్ష్మి అనే మహిళ కిరాణా దుకాణం నిర్వహిస్తోంది. ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో ఆమె దుకాణం వద్ద చెత్త ఊడుస్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆమె మెడలోని గొలుసు లాక్కొని పరారయ్యారు. ఆందోళనకు గురైన ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. అయితే తన మెడలో ఉన్నది అసలు బంగారం కాదు.. రోల్డ్‌గోల్డ్‌ చైను అని బాధితురాలు తెలపడంతో పోలీసులు విస్తుపోవాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement