అనంతపురం ఎడ్యుకేషన్: ‘సాక్షి’ కథనంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఆన్‌లైన్‌లో ఆరో తరగతిగా నమోదైన విద్యార్థిని గ్లోరీ వివరాలను ఐదో తరగతిగా సరిచేశారు. గుత్తి ఏపీఆర్‌ఎస్‌లో 5వ తరగతి చదువుతున్న గ్లోరీ ఆన్‌లైన్ రికార్డుల్లో మాత్రం ఆరో తరగతి విద్యార్థినిగా కనిపిస్తుండటంతో ఎదురవుతున్న ఇబ్బందిని మంగళవారం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ‘ఆన్‌లైన్‌లో ఆరు.. స్కూల్లో ఐదు..’ శీర్షికన కథనం ప్రచురితం చేసింది. శ్రీసత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారులు ఆగమేఘాలపై స్పందించి సమస్య పరిష్కరించారు.
పూర్వ పాఠశాల నిర్లక్ష్యంతోనే సమస్య : గ్లోరీ గతంలో రామగిరి మండలం పేరూరులోని అక్షయ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివింది. అక్కడ నాలుగో తరగతి పూర్తి చేసి ఐదో తరగతికి ప్రమోట్ చేసినట్లు పాఠశాల యాజమాన్యం స్టడీ సర్టిఫికెట్, బదిలీ ధ్రువీకరణ పత్రం (టీసీ) ఇచ్చింది. అయితే ఆన్‌లైన్ డ్రాప్‌బాక్స్‌లో మాత్రం ఆరో తరగతి అని నమోదు కావడంతో కొత్త పాఠశాలలో చేరినప్పటి నుంచి సమస్య ఎదురైంది. పాఠశాలలు పునఃప్రారంభమై ఇన్ని రోజులు గడుస్తున్నా ఈ తప్పిదాన్ని సరిచేయకపోవడంపై విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యను పరిష్కరించి ఆన్‌లైన్ రికార్డుల్లో గ్లోరీ తరగతి వివరాలను ఐదో తరగతిగా మార్చారు. గుత్తి ఏపీఆర్‌ఎస్‌లోనూ విద్యార్థిని తరగతి వివరాలను ఐదో తరగతిగా అప్‌డేట్ చేశారు.
బంగారు దుకాణంలో
భారీ అగ్నిప్రమాదం
తాడిపత్రిటౌన్: పట్టణంలోని అంబటి పుల్లారెడ్డి బంగారు నగల దుకాణంలో సోమవారం అర్థరాత్రి షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు రూ.50 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని అగ్నిమాకశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే షాపు యజమాని అంబటి రామకృష్ణారెడ్డి అందుబాటులో లేరు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


