● కలెక్టర్ ఆనంద్‌ను కోరిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
అనంతపురం అర్బన్: అనంతను కరువు జిల్లాగా ప్రకటించి రైతులు, ప్రజలను ఆదుకునేందుకు రూ.20 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని.. ఈ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ ఆనంద్‌ను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. కలెక్టర్‌ను మంగళవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో శ్రీనివాసరావు, ఇతర నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. వర్షాభావంతో జిల్లాలో పంటల సాగు గణనీయంగా తగ్గిందన్నారు. ఇక సాగు చేసిన పంటలూ ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఉద్యాన పంటల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, నార్పల, శింగనమల, గార్లదిన్నె, ఆత్మకూరు, అనంతపురం రూరల్ ప్రాంతాల్లో పండ్ల తోటలను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. ఎండిన ఉద్యాన తోటలకు ఎకరాకు రూ.లక్ష తక్కువ కాకుండా పరిహారం చెల్లించాలన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నాగేంద్రకుమార్, బాలరంగయ్య, శ్రీనివాస్, చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణమూర్తి, ఆర్‌వీనాయుడు, రామాంజనేయులు, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.


