అనంతపురం అర్బన్: వంట గ్యాస్ కనెక్షన్‌ను ఈ–కేవైసీ చేసుకోకపోతే వినియోగదారులు భారీగా నష్టపోతారు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇప్పటికీ గ్యాస్ కనెక్షన్ ఈ–కేవైసీ చేసుకోనివారు ఈ నెల 30వ తేదీలోగా చేసుకోవాలి. చేసుకోని డొమెస్టిక్ (గృహావసరాల) కనెక్షన్లు ఇకపై కమర్షియల్ (వాణిజ్య) కనెక్షన్లుగా మారిపోతాయి. అంటే వాణిజ్య ధరతో సిలిండర్‌ను కొనాల్సి ఉంటుంది. అంటే అదనపు భారం భరించక తప్పదు.
రెండుసార్లు గడువు పొడిగింపు..
వంట గ్యాస్ కనెక్షన్ ఈ–కేవైసీ చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు కొన్ని నెలలుగా చెబుతూనే ఉన్నాయి. అదే క్రమంలో ఎప్పటికప్పుడు గడువును పొడిగిస్తూనే ఉన్నాయి. తొలుత జూన్ 30 వరకు ఉన్న గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించారు. అయితే ఈ దఫా ఈ–కేవైసీ గడువును పొడిగించే సూచనలు కనిపించడం లేదని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.
కమర్షియల్ ధరతో...
గృహావసర వంట గ్యాస్ సిలిండర్ (14.2 కిలోలు) ధర ప్రస్తుతం రూ.1,020 ఉంది. ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు సిలిండర్‌పై ప్రత్యక్షంగా రూ.50 సబ్సిడీ ఇస్తున్నాయి. ఇదే క్రమంలో డొమెస్టిక్ సిలిండర్లపై ఆయిల్ కంపెనీలు దాదాపు రూ.300 నుంచి రూ.400 భరిస్తున్నట్లు సమాచారం. ఈ–కేవైసీ చేసుకోని గ్యాస్ కనెక్షన్లను కమర్షియల్ కేటగిరీ కిందకు మార్పు చేస్తారు. అలా మారిన కనెక్షన్లకు సంబంధించి సిలిండర్ ధర రూ.1,300 నుంచి రూ.1,400 వరకు ఉంటుందని చెబుతున్నారు.
డెలివరీ బాయ్స్ చేస్తున్నారు...
జిల్లాలో సాధారణ, దీపం పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్లు 6,76,273 ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 85 శాతం మేర ఈ–కేవైసీ జరిగినట్లు సమాచారం. ఈ–కేవైసీ కోసం వినియోగదారులు ఏజెన్సీలకు వెళ్లాల్సిన అవసరం లేదు. డెలివరీ బాయ్స్ తమ మొబైల్ యాప్‌లోనే వినియోగ దారుని ఈ–కేవైసీ చేస్తున్నారు. వినియోగదారు తమ ప్రాంత డెలివరీ బాయ్‌ని సంప్రదించి ఈ–కేవైసీ చేసుకోవచ్చు. అదే విధంగా ఆయిల్ కంపెనీలకు చెందిన వెబ్ పోర్టల్, మొబైల్ యాప్, వాట్సాప్ చాట్‌బాట్ లేదా ఐవీఆర్‌ఎస్ ద్వారా తమ ఆప్షన్‌ను నమోదు చేసుకోవచ్చు.
సరెండర్‌తో తగ్గిన కనెక్షన్లు..
జిల్లాలో ఈ ఏడాది మార్చిలో 7,12,473 డొమెస్టిక్ (గృహావసర) గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే బహుళ కనెక్షన్లు కలిగిన వారు ఒకటి ఉంచుకుని మిగిలిన కనెక్షన్లను సరెండర్ చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలో హెచ్చరించింది. దీంతో పలువురు తమ కనెక్షన్లను సరండర్ చేశారు. అదే విధంగా అక్రమంగా కలిగిన కనెక్షన్లను ఆయిల్ కంపెనీలు తొలగించాయి. దీంతో జిల్లావ్యాప్తంగా 36,200 డొమెస్టిక్ కనెక్షన్లు తగ్గడంతో ప్రస్తుత కనెక్షన్ల సంఖ్య 6,76,273గా ఉంది.
అక్టోబరు 1 నుంచి కొత్త నిబంధనలు
ఈ–కేవైసీ చేసుకోనివారికి
‘కమర్షియల్’ ధరతోనే సిలిండర్
జిల్లాలో 6.76 లక్షల కనెక్షన్లలో
85 శాతం ఈ–కేవైసీ పూర్తి


