పెద్దపప్పూరు: మండలంలో ప్రఖ్యాతి గాంచిన చాగల్లు చౌడేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారి వెండి కిరీటం చోరీకి గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగుడు ముఖానికి మాస్కు ధరించి గుడి తాళాలు పగుల గొట్టి రూ.50 వేల విలువగల అమ్మవారి వెండి కిరీటాన్ని చోరీ చేశాడు. ఈ దృశ్యం సీసీ టీవీలో రికార్డు అయింది. ఆదివారం అమ్మవారికి పూజలు నిర్వహించాలని వెళ్లిన పూజారి కిరీటం కనిపించకపోవడంతో నిర్ఘాంతపోయాడు. గ్రామస్తులు పెద్దపప్పూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ చంద్రశేఖర్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు.
యువకుడి దారుణ హత్య
తాడిపత్రిటౌన్: పాత కక్షల నేపథ్యంలో యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన తాడిపత్రి పట్టణంలోని భగత్‌సింగ్ నగర్‌లో జరిగింది. సీఐ ఆరోహణ రావు తెలిపిన మేరకు.. భగత్ సింగ్ నగర్‌కు చెందిన వన్నూరప్ప, రాముడు, పెద్దిరాజు కుటుంబాల నడుమ చాలా కాలంగా పాత కక్షలు నడుస్తున్నాయి. గతంలో ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆదివారం రాముడు, పెద్దిరాజు కుటుంబ సభ్యులైన శివ, నరేష్, ధనుంజయ, రవి, సోమశేఖర్‌లు వన్నూరప్ప కుటుంబంపై దాడికి దిగారు. వన్నూరప్ప కుమారుడు కుళ్లాయప్ప(25)ను కత్తితో పొడిచారు. ఈ క్రమంలోనే కుప్పకూలిపోయిన అతడిని స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుళ్లాయప్పకు భార్య నీలావతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు సీఐ ఆరోహణ రావు కేసు నమోదు చేశారు.
నేడు డయల్ యువర్
ఎస్పీడీసీఎల్ సీఎండీ
అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు మొబైల్: 8977716661 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ నంబర్‌ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు.
జిల్లాలో డయల్ యువర్ ఎస్‌ఈ..
జిల్లాలో డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు ఫోన్ నంబర్లు 08554–272943, 9154790350కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం సెంట్రల్: జిల్లాలో నోటిఫై చేసిన మద్యం దుకాణాలకు నాలుగు రోజులే గడువు ఉందని, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి.రామ్మోహన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఓపెన్ కేటగిరీలో 50, గీత కులాలకు సంబంధించి 3 దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ రాత్రి 12 గంటల వరకూ మాత్రమే గడువు ఉందని, 3న దరఖాస్తుల పరిశీలన, 5న లాటరీ ద్వారా షాపుల కేటాయింపు ఉంటుందన్నారు. రూ. 3 లక్షలు నాన్ రీ ఫండబుల్ రుసుం, రూ.1,000 ప్రాససింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తుదారునికి 21 సంవత్సరాలు, ఒక వ్యక్తి ఒక దుకాణానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనలు ఉన్నాయన్నారు. ప్రతి దుకాణానికి తప్పనిసరిగా 10 దరఖాస్తులు రావాలని, లేదంటే సదరు దుకాణం వేలం వాయిదా వేస్తామన్నారు.
క్రికెట్ ప్రాబబుల్స్‌కు ఎంపిక
అనంతపురం: జిల్లా క్రీడాకారులకు అరుదైన గౌరవం లభించింది. త్వరలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్వహించనున్న స్టేట్ ప్రాబబుల్స్ మ్యాచ్‌లకు జిల్లాకు చెందిన క్రికెటర్లు హనీష్ వీరారెడ్డి, మల్లికార్జున, జయంత్ కృష్ణ, దీపక్ ఎంపికయ్యారు. దీనిపై జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సి. శ్రీనాథ్, సెక్రటరీ శ్రీధర్, అసోసియేషన్ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు, కోచ్‌లు హర్షం వ్యక్తం చేశారు. మ్యాచుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఫైనల్ స్టేట్ టీమ్‌కు ఎంపికై జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


