అనంతపురం అగ్రికల్చర్: మూడు నెలల పాటు వర్షం జాడలేక అల్లకల్లోలంగా మారిన ‘అనంత’ను వాయుగుండం ఆదుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఈనెల 20 నుంచి 25 తేదీల మధ్య జిల్లాలో వర్షాలు కురిశాయి. లేదంటే పరిస్థితి భయానకంగా తయారయ్యే దశకు చేరుకునేది. జూన్ ఒకటి నుంచి మొదలైన కీలకమైన ఖరీఫ్‌లో సెప్టెంబర్ 19వ తేదీ నాటికి సాధారణం కన్నా ఏకంగా 52 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. జూన్‌లో సాధారణ వర్షం కురిసినా... జూలైలో 71 శాతం, ఆగస్టులో 60 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ 19 వరకు తీవ్ర వర్షాభావం కొనసాగింది.
ఆరు రోజుల్లో 88 మి.మీ సగటు..
ఈనెల 19 వరకు తీవ్ర వర్షాభావం నెలకొనగా... వాయుగుండం ప్రభావంతో 20 నుంచి మంచి వర్షాలు కురిశాయి. 20న 43 మి.మీతో ఈ సీజన్‌లోనే అత్యధిక సగటు వర్షపాతం నమోదైంది. ఐదారు మండలాలు మినహా జిల్లా అంతటా చెప్పుకోదగ్గ వర్షాలు కురిశాయి. అలాగే 21న 7.5 మి.మీ, 22న 17 మి.మీ, 23న 6 మి.మీ, 24న 11.8 మి.మీ, 25న 3 మి.మీ... వరుసగా ఆరు రోజుల పాటు వర్షం పడటంతో 88 మి.మీ సగటు నమోదైంది. యాడికి, నార్పల, బొమ్మనహాళ్, పామిడి, తాడిపత్రి, పెద్దవడుగూరు, యల్లనూరు, ఆత్మకూరు, గార్లదిన్నె, ఉరవకొండ, పుట్లూరు, వజ్రకరూరు, గుత్తి, కణేకల్లు మండలాల్లో మంచి వర్షాల కురిశాయి. దీంతో సెప్టెంబర్ 19 నాటికి 265.5 మి.మీ గానూ 127.1 మి.మీ నమోదైంది. సాధారణం కన్నా 52 శాతం లోటు ఏర్పడింది. వాయుగుండంతో కురిసిన వర్షాల తర్వాత 303.4 మి.మీ గానూ 212.9 మి.మీ నమోదైంది. దీంతో వర్షపాతం లోటు 30 శాతంతో కొనసాగుతోంది.
కొన్ని మండలాల్లో తేలికపాటే..
ఐదారు రోజులు విస్తారంగా వర్షాలు కురిసినా... కొన్ని మండలాల్లో తేలికపాటి నమోదుకావడం గమనార్హం. రాయదుర్గం మండలంలో 115 మి.మీ గానూ కేవలం 14.6 మి.మీ నమోదైంది. ఈ మండలంలో 73 శాతం తక్కువగా వర్షం కురిసింది. గుమ్మఘట్టలో 58.8 మి.మీ గానూ 77 శాతం తక్కువగా 22.4 మి.మీ, బ్రహ్మసముద్రంలో 85.9 మి.మీ గానూ 60 శాతం తక్కువగా 35.1 మి.మీ, డి.హీరేహాళ్‌లో 70.6 మి.మీ గానూ 67 శాతం తక్కువగా 23.3 మి.మీ మాత్రమే నమోదైంది. రాప్తాడు, బుక్కరాయసముద్రం తదితర మరో నాలుగైదు మండలాల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. ఓవరాల్‌గా జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. పెద్దవడుగూరు మినహా మిగతా అన్ని మండలాల్లోనూ సాధారణం కన్నా తక్కువగానే వర్షాలు కురిశాయి. నాలుగు నెలల కాలంలో కేవలం 19 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు ప్రభుత్వం కరువు జాబితాలో కొర్రీలు వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అందులో నాలుగు మండలాలు దోబూచులాడుతున్నట్లు తెలుస్తోంది.
20 నుంచి 25వ తేదీ మధ్య
88 మి.మీ సగటు వర్షపాతం
ఓవరాల్‌గా 30 శాతం లోటు వర్షమే
ఇటీవల కురిసిన వర్షాలతో
కరువు మండలాలకు కొర్రీ...?


