అనంతపురం: పెల్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని, పనిలో పనిగా ఖజానాను కొల్లగొట్టేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పాలసీ తీసుకొచ్చిందని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సి. రమేష్ గౌడ్ మండిపడ్డారు. అనంతపురం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన సోషల్ మీడియా వేదికలను ప్రభుత్వ ప్రచార సాధనాలుగా మార్చాలనుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో టీడీపీకి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్లకు పారితోషికాలు చెల్లిస్తారని, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఆ పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టాలని చూడడం దుర్మార్గమన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే స్వేచ్ఛ, ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు, వాస్తవాలను వెల్లడించడంలో సోషల్ మీడియా కీలకమన్నారు. ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందుతున్నామన్న కారణంతో ప్రజా గళాన్ని వినిపించే స్వేచ్ఛను కొంతమంది క్రెడిబిలిటీ కలిగిన ఇన్‌ఫ్లూయెన్సర్లు వదులుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో నిరాశ మిగిల్చిందని విమర్శించారు. హామీలను అమలు చేయకుండా ప్రచారానికి పెద్దపీట వేయడం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావన్నారు. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని, వాటిని ఏ ప్రభుత్వం లేదా రాజకీయ వ్యవస్థ ప్రభావితం చేయకూడదని హితవు పలికారు. ‘వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాం.. ప్రజా గళాన్ని వినిపిస్తాం.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు పోరాడతాం’ అని స్పష్టం చేశారు.


