అభివృద్ధి చేయాలి
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యాటకం నుంచి వచ్చే ఆదాయంపైనే ఆయా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కానీ రాష్ట్రంలో పర్యాటక రంగం నిర్వీర్యమైపోతోంది. భావితరాలకు చెప్పాల్సిన ఎన్నో విషయాలు మన పర్యాటక ప్రాంతాలు వివరిస్తాయి. జిల్లాలోని యాడికి గుహలు, కుందుర్పి, కొనకొండ్ల వంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి.
– కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇంటాక్ కోశాధికారి
పాలకులు దృష్టి సారించాలి
గుత్తికోట విశిష్టతపై పదే పదే మంత్రులు, అధికారులు చెబుతారు కానీ ఒక్క పైసా అభివృద్ధి కోసం వెచ్చించడం లేదు. గతంలో జబర్దస్త్ యాక్టర్లపై చేసిన ఖర్చును కోటలో నీటి వసతి, రోడ్ల నిర్మాణాలకు వెచ్చించి ఉంటే బాగుండేది. ప్రచార ఆర్భాటం, హంగామా కాకుండా నిజమైన అభివృద్ధిపై దృష్టి సారించాలి.
– రాజశేఖరరెడ్డి,
గుత్తికోట సంరక్షణ సమితి ప్రతినిధి
అనంతపురం కల్చరల్: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. అధికారంలోకి రాగానే పర్యాటకానికి ప్రాధాన్యతనిస్తామని చెప్పిన కూటమి నాయకులు ఆ ఊసే నేడు ఎత్తడం లేదు. ఈ క్రమంలో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా జిల్లాలోని పర్యాటక ప్రదేశాల పరిస్థితి మారిపోయింది.
అమలు కాని హామీలు..
జిల్లా పర్యాటకంలో అగ్ర స్థానంలో నిలిచే గుత్తి కోటను అభివృద్ధి చేస్తామని అనేక సార్లు ప్రజాప్రతినిధులు, అధికారులు హామీలిచ్చారు. కోటను సందర్శించిన ప్రతి సారీ రూ.కోటి విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే, అవన్నీ నెరవెరలేదు సరికదా.. ఎన్నోసార్లు గుత్తి కోట పరిరక్షణ సమితి ప్రతినిధులు కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎక్కడా చలనం లేకుండా పోయింది. అభివృద్ధి మాట దేవుడెరుగు సరైన రోడ్ల నిర్మాణం చేపట్టలేదు. కనీసం నీటి వసతి కల్పించలేకపోయారు. అయితే, ఈ ఏడాది మార్చిలో గుత్తికోట ఉత్సవాల పేరిట హంగామా చేయడం గమనార్హం. బుల్లితెర నటులను పిలిపించి హడావుడి కూడా చేశారు. దీనికి రూ.లక్షలు ఖర్చు చూపించారు. అవే నిధులను కోట అభివృద్ధికి ఎందుకు కేటాయించలేదని సంరక్షణ సమితి వారు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు అధికారుల నుంచి ఇప్పటికీ సమాధానం లేదు. గుత్తి కోటతో పాటు జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రాల వద్ద హోటళ్లు, పార్కులు నిర్మిస్తామని చెప్పిన మాటలేమయ్యాయని అందరూ నిలదీస్తున్నారు.
సందర్భం
అభివృద్ధికి నోచుకోని
పర్యాటక ప్రదేశాలు
హామీలిచ్చి మరిచిపోతున్న
పాలకులు, అధికారులు
పెదవి విరుస్తున్న పర్యాటక ప్రేమికులు


