అనంతపురం న్యూ టౌన్: వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌వి అసత్య ప్రచారాలన్న వాస్తవం తేటతెల్లమైందని జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ స్పష్టం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ నివేదికతో కూటమి కుట్రలు పటాపంచలైనట్లు ఆమె తెలిపారు. జెడ్పీ కార్యాలయంలోని తన చాంబర్‌లో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని, ఇటు సీబీఐ ఎస్‌ఐటీ, అటు ఈడీ తమ విచారణలో తేల్చాయన్నారు. ఇది ఒక విధంగా సీఎం చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిదని ఆమె ధ్వజమెత్తారు. ప్రైవేట్ సరఫరాదారులు, డెయిరీ కంపెనీల యజమానులు కేవలం వ్యాపార లాభాల కోసం పామ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్, రసాయన కల్తీలకు పాల్పడ్డారని, అలాంటి వారిపై ఈడీ కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొనడం శుభ పరిణామమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో తిరుమల పవిత్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఉండేదన్నారు.


