రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Sep 19 2026 4:14 AM | Updated on Sep 19 2026 4:14 AM

గుత్తి: పట్టణ శివారులోని కర్నూలు రోడ్డు కోళ్లఫారం సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బెస్త శ్రీరాములు (38) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బెస్త వీధికి చెందిన శ్రీరాములు, రామలక్ష్మి దంపతులకు కుమారుడు, కుమార్తె కర్నూలు రోడ్డులోని మహర్షి దయానంద గురుకుల పాఠశాలలో ఏడు, ఐదో తరగతి చదువుతున్నారు. శ్రీరాములు పిల్లలను పిలుచుకొని రావడానికి స్కూటీపై బయల్దేరాడు. మార్గంమధ్యలో స్కూల్‌ వ్యాన్‌ ఢీకొనింది. స్కూటీ రోడ్డు పక్కకు ఎగిరి పడింది. రోడ్డుపైనే శ్రీరాములు పడి మృతి చెందాడు. భర్త మరణ వార్త విని భార్య రామలక్ష్మి, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్‌ డ్రైవర్‌ పరారీ అయ్యాడు. ఘటనపై సీఐ రామారావు కే సు దర్యాప్తు చేపట్టారు.

కుటుంబ కలహాలతో

భర్త హత్య

కళ్యాణదుర్గం రూరల్‌: మండలంలోని చాపిరి గ్రామంలో భర్తను భార్య హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...నారాయణపురం గ్రామం నుంచి చాపిరి గ్రామానికి బతుకుదెరువు కోసం వచ్చిన నాగరాజు, రత్నమ్మ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈమధ్య కాలంలో నాగరాజు తాగుడుకు బానిసయ్యాడు. తరుచూ భార్యాభర్తలు తగువు పడుతుండేవారు. గురువారం రాత్రి భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. గొడవ సద్దిమణిగిన తర్వాత ఒక్కసారిగా భార్య రత్నమ్మ భర్త నాగరాజుపై కర్రతో తలపై బాదింది. ఈ దాడిలో గాయపడిన నాగరాజును స్థానికులు వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతూ నాగరాజు శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ సీఐ గంగాధర్‌ తెలిపారు.

డీపీఓ పోస్టుకు

దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ (టీఎంఎఫ్‌) పోస్టును ఔట్‌సో ర్సింగ్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ అయ్యూబ్‌ హుస్సేన్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నెలకు రూ.25 వేల వేతనం చెల్లిస్తారు. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హతతో పాటు తెలుగు, ఇంగ్లిష్‌ భాషలపై మంచి పట్టు, సమర్థవంతమైన సంభాషణ నైపుణ్యాలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. విద్యాశాఖ లేదా ఇంటర్మీడియట్‌ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన అసిస్టెంట్‌ డైరెక్టర్లు, సూపరింటెండెంట్లకు ప్రాధాన్యం ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన, ప్రతిభా పరీక్ష, మౌఖిక ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నెల 22లోపు దరఖాస్తులు సమర్పించాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన బయోడేటాతో పాటు విద్యార్హత, అనుభవ ధ్రువపత్రాల జిరాక్స్‌ కాపీలను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని డీఈఓ సూచించారు.

విద్యుదాఘాతంతో మహిళా రైతుకు తీవ్ర గాయాలు

గుత్తి రూరల్‌: మండలంలోని టి.కొత్తపల్లిలో శుక్రవారం విద్యుదాఘాతంతో నాగలక్ష్మి అనే మహిళా రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన ఆదిశేషులు, నాగలక్ష్మి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నాగలక్ష్మి గ్రామ శివారులోని పంటకు నీరు పెట్టేందుకు వెళ్లింది. వ్యవసాయ బోరు స్విచ్‌ ఆన్‌ చేస్తున్న క్రమంలో స్టార్టర్‌ బాక్సు వద్ద తెగి ఉన్న తీగ తగిలి ఆమె షాక్‌కు గురైంది. ఈ ప్రమాదంలో సొమ్మసిల్లి పడి అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్సలకు అనంతపురానికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వివాహిత ఆత్మహత్య

గార్లదిన్నె: బూదేడుకు చెందిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. శుక్రవారం పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన అనూష (30) గత బుధవారం ఇంటి వద్ద విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితిలో ఉండగా ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతిచెందింది. మృతు రాలికి కొడుకు,కుమార్తె ఉన్నారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement