బొమ్మనహాళ్: మండలంలోని నేమకల్లు శివారులోని క్వారీల్లో అనుమతి లేకుండా తెల్లరాయి తవ్వకాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుపై మైన్స్ అండ్ జియాలజీ అధికారులు రెండో రోజు శుక్రవారం కూడా తనిఖీలు నిర్వహించారు. కర్నూలు రీజినల్ మైన్స్‌అండ్ జియాలజీ విజిలెన్స్ అధికారి రాజశేఖర్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా మైనింగ్ అధికారుల బృందం సభ్యులు క్వారీలను పరిశీలించారు. కర్నూలు రీజినల్ మైన్స్‌అండ్ జియాలజీ ఏజీ రాజశేఖర్ మాట్లాడుతూ అనుమతి లేకుండా తెల్లరాయి తవ్వకాలు చేస్తున్నారన్న ఫిర్యాదులు కేంద్ర మైన్స్ అండ్ జియాలజీ కార్యాలయాలనికి అందడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేమకల్లు కొండల్లోని క్వారీల్లో రెండురోజుల పాటు తనిఖీలు నిర్వహించామన్నారు. పీహెచ్ భారతి 4.398 హెక్టార్లు, శివరాజు 4.958 హెక్టార్లు, మోహన్‌దాస్ 2.620 హెక్టార్లు, గురుప్రసాద్ 2.082 హెక్టార్లకు ప్రభుత్వం లీజు మంజూరు చేసిందన్నారు. అయితే అనుమతులు లేకపోయినా కేటీ లాలుస్వామి 2.646 హెక్టార్లు, తిమ్మనగౌడ్ 3.632 హెక్టార్లు, అలైఖ్య 4.684 హెక్టార్లలో తవ్వకాలు సాగిస్తున్నారన్నారు. లీజు అనుమతుల కోసం వీరు రెండేళ్ల క్రితం దరఖాస్తులు చేసుకున్నారని, అయితే వాటిని 8 నెలల క్రితమే రద్దు చేసినట్లు తెలిపారు. కేటీ లాలుస్వామి, తిమ్మనగౌడ్ క్వారీల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రదేశాల్లోనే అక్రమంగా తెల్లరాయిని తవ్వుతున్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలు, యంత్రాలను గురువారమే సీజ్ చేసిన్నట్లు చెప్పారు. అన్ని క్వారీల్లో సర్వేలు చేశామని, నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని ఏజీ తెలిపారు. తనిఖీల్లో రాయల్టీ ఇన్‌స్పెక్టర్ పురుషోత్తం, టెక్నికల్ అసిస్టెంట్ దిలీప్‌కుమార్, అనంతపురం రాయల్టీ ఇన్‌స్పెక్టర్ సుప్రజ, సర్వేయర్ నిర్మల్ పాల్గొన్నారు.


