అనంతపురం అర్బన్: మైనార్టీల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయాలని శాసనసభ మైనార్టీల సంక్షేమ కమిటీ చైర్మన్ మహమ్మద్ నసీర్ అహమ్మద్ జిల్లా అధికారులకు సూచించారు. మైనార్టీల కోసం చేపట్టిన కార్యక్రమాలపై చైర్మన్ శనివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ కలిసి అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైనార్టీల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా? అనే అంశాలను పరిశీలించడమే కమిటీ ఉద్దేశమన్నారు. రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక ప్రకారం ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. సమాజంలో విద్య ద్వారానే మార్పు సాధ్యమవుతుందన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, వాటి ద్వారా ఆదాయ వనురల పెంపు, మసీదుల ఇమామ్‌లు, మౌజమ్‌ల గౌరవ వేతనం తదితర అంశాలపై కమిటీ సమీక్షించిందన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలోని కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్రతి అధికారి కృషి చేయాలన్నారు. అనంతరం కమిటీ చైర్మన్, సభ్యులను కలెక్టర్ సన్మానించారు. సమావేశంలో కమిటీ సభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఇషాక్‌బాషా, సుందరపు విజయ్‌కుమార్ ఖాజీ యాకూబ్‌బాషా, కమిటీ సెక్షన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, కమిటీ అదనపు కార్యదర్శి ఈశ్వరరావు, మైనార్టీ సంక్షేమ శాఖాధికారి రామసుబ్బారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


