డేంజర్ బెల్స్..
అనంతపురం అగ్రికల్చర్: భూగర్భ జలాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. నైరుతిలో కదలిక లేక వర్షాలు మొహం చాటేశాయి. జూన్ 15 తర్వాత వంకలు ప్రవహించే వర్షం ఒక్కరోజు కూడా నమోదు కాలేదు. దీంతో భూగర్భజలాలు క్రమంగా పతనమవుతూ ప్రమాదఘంటికలు మోగిస్తున్న పరిస్థితి నెలకొంది. 2.20 లక్షల హెక్టార్ల ఖరీఫ్ పంటలు ఎండుముఖం పట్టాయి. పెట్టుబడి కూడా చేతికివచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ప్రత్యామ్నాయం, రబీకి కూడా అనుకూల వాతావరణం లేదు. మున్ముందు పట్టు, పాడి, పశుపోషణ, పండ్లతోటల మనుగడకు ముప్పు తప్పదనే ఆందోళన నెలకొంది. 500 నుంచి 800 అడుగుల లోతు వరకు కొత్తగా బోర్లు వేయిస్తున్నా అందులో సగానికి పైగా ఫెయిల్ అవుతున్నాయి.
15.19 మీటర్లుగా నమోదు ..
భూగర్భ జలశాఖ ఇటీవల జిల్లా వ్యాప్తంగా 91 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫిజోమీటర్ల నుంచి సేకరించిన గణాంకాల ప్రకారం సగటు నీటి మట్టం 15.19 మీటర్లుగా నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయికి నీటిమట్టం తగ్గిపోవడం గమనార్హం. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల 32 మండలాల్లో 60 నుంచి 70 వరకు వర్షపాత విరామాలు(డ్రైస్పెల్స్) నమోదయ్యాయి. మంచి వర్షాలు సమృద్ధిగా కురవాల్సిన సమయంలో బలమైన గాలులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వర్షాకాలంలోనే పరిస్థితి ఇలాగుంటే వచ్చే వేసవికి భూగర్భజలాలు ప్రమాదకర స్థాయికి పతనం కావచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
డేంజర్‌లో 9... ఒత్తిడిలో 12 మండలాలు
నీటి వాడకం అధికంగా ఉన్నందున ఇప్పటికే 9 మండలాలను ‘డేంజర్ జోన్’లోకి చేర్చారు. తాడిపత్రి, రాయదుర్గం, డి.హీరేహాళ్, కణేకల్లు, పుట్లూరు, కుందుర్పి, కళ్యాణదుర్గం, యాడికి, శెట్టూరు మండలాలు డేంజర్‌లో ఉండగా... నార్పల, యల్లనూరు, వజ్రకరూరు, శింగనమల, గుత్తి, బ్రహ్మసముద్రం, కూడేరు, బెళుగుప్ప, గుమ్మఘట్ట, కంబదూరు, పామిడి, బొమ్మనహాళ్ తదితర 12 మండలాలు తీవ్ర ఒత్తిడి జాబితాలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పెద్దపప్పూరు మాత్రమే సేఫ్ జోన్‌లో ఉండగా మరో 10 మండలాల్లో మోస్తరుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నగరూరులో 66.32 మీటర్లుగా నమోదు..
ప్రస్తుతం సగటు నీటి మట్టం 15.19 మీటర్లుగా నమోదైంది. గతనెలలో 14.58 మీటర్లుగానూ, గతేడాది ఇదే సమయంలో 10.71 మీటర్లుగా భూగర్భజలాలు ఉన్నట్లు నమోదైంది. గతేడాదితో పోల్చితే 4.48 మీటర్లు లోతుకు పతనం కావడం ఆందోళన కలిగించే అంశంగా భావిస్తున్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు 248.8 మి.మీ గానూ 50 శాతం తక్కువగా 123 మి.మీ వర్షపాతం నమోదు కావడంతో నీటి వనరుల లభ్యత గణనీయంగా తగ్గిపోయింది. ఈ సీజన్‌లో ఒకట్రెండు సార్లు కొన్ని మండలాలు మినహా చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లే వర్షాలు కురవకపోవడంతో నదీ పరివాహక ప్రాంతాలు కూడా ఒట్టిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టం కనిపించనంత లోతుకు పడిపోయింది. ఈ సీజన్‌లో వర్షాల రూపంలో 29 టీఎంసీల నీళ్లు ప్రవహించగా అందులో 3.48 టీఎంసీలు మాత్రమే భూగర్భంలో ఇంకిపోయినట్లు అధికారులు తెలిపారు. యాడికి మండలం నగరూరు ఫిజోమీటర్‌లో 66.32 మీటర్లు, అలాగే శెట్టూరు మండలం చెర్లోపల్లిలో 56.15 మీటర్లు, పుట్లూరులో 43.70 మీటర్లు ఇలా చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్న పరిస్థితి నెలకొంది. మున్ముందు ఎదురయ్యే పరిస్థితులపై రైతులు, ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయికి
పతనమైన గంగమ్మ
ఎల్–నినో వర్షాభావంతో
క్షీణిస్తోన్న భూగర్భజలం
డేంజర్‌లో తొమ్మిది,
తీవ్ర ఒత్తిడిలో 20 మండలాలు
తాజా సగటు నీటిమట్టం
15.19 మీటర్లుగా నమోదు


