అనంతపురం అగ్రికల్చర్: ఎల్–నినో ఉపద్రవం కారణంగా రెండు నెలలకు పైగా జిల్లా అంతటా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 32 మండలాల్లోనూ సుదీర్ఘ వర్షపాత విరామాలు (డైస్పెల్స్) నమోదయ్యాయి. అతికష్టమ్మీద సాగులోకి వచ్చిన 2.38 లక్షల హెక్టార్ల పంట దిగుబడులపై ఆశలు వదులుకున్న రైతులు ఏమి చేయాలో దిక్కుతోచక ఇప్పుడు పంటల బీమాపై భారం మోపారు. కానీ చంద్రబాబు సర్కారు రెండేళ్లుగా పంటల బీమా ద్వారా సాయం అందించకపోవడంతో రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2024 ఖరీఫ్‌కు సంబంధించి కేంద్రం రూ.130 కోట్లు పరిహారం ఇచ్చినట్లు చెబుతున్నా... అందుకు సరైన లెక్కలు చూపడం లేదు. ఇలా పరిహారంపై అనుమానాలు ఉన్నా... గత రెండేళ్లు ఒక ఎత్తు కాగా... ఇప్పుడు ఎల్–నినో తీవ్రత కారణంగా పరిస్థితి దయనీయంగా ఉన్నందున పంటల బీమాపై గంపెడాశలు పెట్టుకున్నారు.
వాతావరణ బీమా పథకం కింద వేరుశనగ, పత్తి, చీనీ, దానిమ్మ, టమాట, అరటి పంటలకు వర్తింపజేశారు. వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలిలో తేమశాతం లాంటి ఆన్‌లైన్ వాతావరణ డేటా ఆధారంగా పరిహారం లెక్కలోకి తీసుకుంటారు. వాతావరణ బీమా కింద పంటలకు ప్రీమియం కూడా ఎక్కువే అయినా 87 వేల మంది రైతులు 1.25 లక్షల హెక్టార్ల పంటలకు ప్రీమియం చెల్లించారు. ఇక పంట కోత ప్రయోగాల ఫలితాలు అంటే పంట దిగుబడులు ఆధారంగా ప్రధానమంత్రి ఫసల్‌బీమా కింద కంది, జొన్న, మొక్కజొన్న, ఆముదం, వరి, ఎండుమిరప పంటలకు వర్తింపజేశారు. ప్రధానంగా గ్రామం యూనిట్‌గా దిగుబడులు లెక్కించి కంది పంటకు బీమా వర్తింపజేశారు. దీంతో కంది పంటకు బీమా అధికంగా చేయించారు. ఇలా ఫసల్‌బీమా కింద 1.53 లక్షల మంది రైతులు 2.45 లక్షల హెక్టార్ల పంటలకు తమ వాటా కింద ప్రీమియం చెల్లించారు. ఇలా రెండు పంటల బీమా పథకాల కింద 2.40 లక్షల మంది రైతులు 3.70 లక్షల హెక్టార్ల పంటలకు బీమా చేయించారు. మొత్తంగా రూ.3,200 కోట్లు విలువ చేసే పంట ఉత్పత్తులకు బీమా చేయించి రూ.52 కోట్లు మేర తమ వాటా కింద ప్రీమియం చెల్లించారు. పంటల బీమా చేయించడంలో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కర్నూలు, సత్యసాయి జిల్లాలు రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు బీమా చేయించిన పంటలన్నీ ఈ–క్రాప్‌లో నమోదైతే తప్ప బీమా వర్తించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వేరుశనగ, కంది, ఎండుమిరప, వరి రైతుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది.
గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో 2019–2024 మధ్య ఐదేళ్లూ వాతావరణబీమా, ఫసల్‌బీమా పథకాలు ఉచితంగా అమలు చేశారు. రైతుల మీద ప్రీమియం భారం మోపకుండా సాగు చేసిన పంటలను ఈ–క్రాప్‌లో నమోదైతే చాలు నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తింపజేశారు. నిబంధనల మేరకు అత్యంత పారదర్శకంగా పరిహారం కూడా అందించడంతో రైతులు సంతోషంగా సేద్యపు పనులు చేశారు. అలా ఐదేళ్ల కాలంలో పంటల బీమా కింద జిల్లా రైతులకు ఏకంగా రూ.1,160 కోట్ల పరిహారం అందించారు. 2024లో అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసిన చంద్రబాబు సర్కారు.. బీమా భారం మోపడంతో పాటు ప్రీమియం చెల్లింపునకు కూడా ఇబ్బందులు పడేలా చేయడం, కంటితుడపుగా పరిహారం ఇవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్–నినో ఎఫెక్ట్..
వర్షాభావంతో పంట దిగుబడులపై
తీవ్ర ప్రభావం
రూ.3,200 కోట్లు విలువ చేసే
పంట ఉత్పత్తులకు బీమా
కష్టకాలంలోనూ రూ.52 కోట్ల ప్రీమియం చెల్లించిన రైతులు
జగన్ హయాంలో
ఉచిత బీమాతో సాంత్వన
బీమా పరిధిలోకి
3.70 లక్షల హెక్టార్ల పంటలు


