నిర్విఘ్నం.. దశ భుజం | - | Sakshi
Sakshi News home page

నిర్విఘ్నం.. దశ భుజం

Sep 14 2026 3:26 AM | Updated on Sep 14 2026 3:26 AM

రాయదుర్గంటౌన్‌: ఏ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలన్నా ముందుగా అందరికీ గుర్తొచ్చేది వినాయకుడే. పూజల్లో తొలిస్థానం ఆయనదే. అంతటి మహిమ గల గణేశుడి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సాధారణంగా వినాయకుడి విగ్రహం ఎలా ఉంటుందని ఎవరిని అడిగినా కళ్లు మూసుకుని ఠక్కున చెప్పేస్తారు. అయితే దశభుజ గణపతి విగ్రహాన్ని మాత్రం ఎక్కువ మంది చూసుండరు. ఇది దేశంలోనే అరుదైన మహాగణపతి విగ్రహం.

కొండపైకి వెళ్లే దారిలో...

రాయదుర్గం పట్టణంలోని దశభుజ గణపతి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. రాయదుర్గం కొండపైకి వెళ్లే దారిలో పట్టణంలోని ఆత్మకూరు వీధిలో దశభుజగణపతి ఆలయం ఉంటుంది. ఇక్కడ ఏకశిలపై దాదాపు 15 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో దశభుజాలతో వినాయకుడ్ని మలిచారు. ఇక్కడి గణపతికి మొత్తం పది చేతులుంటాయి. ఎడవైపున 5 చేతులు, కుడివైపున 5 చేతులతో ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధంతో భక్తులకు దర్శనమిస్తుంటారు. కుడి వైపు మొదటి చేతిలో నారీకేళం, రెండో చేతిలో చక్రం, మూడో చేతిలో త్రిశూలం, నాలుగో చేతిలో ధనుస్సు, ఐదో చేతిలో అంకుశం ఉంటాయి. ఎడవైపున మొదటి చేతిలో భార్య సిద్ధి, రెండో చేతిలో శంఖం, మూడో చేతిలో పవిత్రం, నాలుగో చేతిలో శరం, ఐదో చేతిలో ఖడ్గంతో స్వామివారు కనిపిస్తుంటారు.

ఆది, మంగళవారాల్లో పూజలు..

సిద్ధ వినాయకుడి ఆలయాన్ని కొందరు మహా గణపతి ఆలయం అని కూడా పిలుస్తుంటారు. ఈ విగ్రహం రాయదుర్గం కోట నిర్మాణ సమయంలో మలచబడి ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విగ్రహంలో వినాయకుడి తొండం కుడివైపునకు ఉండడం మరో విశేషం. ప్రతి ఆదివారం, మంగళవారాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి దశభుజ గణపతి ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు వస్తుంటారు. వినాయక చవితి సందర్భంగా ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి.

రాయదుర్గంలో అరుదైన

దశభుజ మహాగణపతి విగ్రహం

15 అడుగుల ఎత్తు, 12 అడుగుల

వెడల్పుతో స్వామివారి దర్శనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement