గాండ్లపాడు ఘటనలో నిందితుడిని శిక్షించాలి | - | Sakshi
Sakshi News home page

గాండ్లపాడు ఘటనలో నిందితుడిని శిక్షించాలి

Sep 8 2026 12:23 AM | Updated on Sep 8 2026 12:23 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: పాఠశాలలోకి చొరబడి ఉపాధ్యాయుడిపై దాడి చేయడంతో పాటు విద్యా పరికరాలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (వైఎస్‌ఆర్‌టీఏ) డిమాండ్‌ చేసింది. పుట్లూరు మండలం గాండ్లపాడు ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఘటనను సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సోమవారం డీఈఓ అయ్యూబ్‌హుస్సేన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పాఠశాలతో ఎలాంటి సంబంధం లేని ఓ వ్యక్తి మద్యం తాగేందుకు డబ్బు కావాలంటూ ఉపాధ్యాయుడిని వేధించాడని, డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో దాడి చేసి తలపై గాయపరిచాడని తెలిపారు. అంతటితో ఆగకుండా పాఠశాలలోని ఐఎఫ్‌బీ ప్యానల్‌ బోర్డు, బెంచీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను ధ్వంసం చేశాడని పేర్కొన్నారు. ఈ ఘటనతో ఉపాధ్యాయులు విధులు నిర్వహించేందుకు భయపడుతున్నారని తెలిపారు. పోలీసులు, విద్యాశాఖ అధికారులు ఘటనను తీవ్రంగా పరిగణించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాలలో ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని కోరారు.

అశోక్‌కుమార్‌రెడ్డిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలి

వైఎస్‌ఆర్‌టీఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి.అశోక్‌కుమార్‌రెడ్డి సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని నాయకులు డీఈఓను కోరారు. టెట్‌కు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చే సమయంలో డీఎస్సీపై ఫిర్యాదు చేశారనే కారణంతో సంబంధం లేని అంశాన్ని ముడిపెట్టి సస్పెండ్‌ చేయడం విచారకరమన్నారు. నిరాధార ఆరోపణలతో విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. డీఈఓను కలిసిన వారిలో వైఎస్‌ఆర్‌టీఏ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోవింద్‌రెడ్డి, రాధాకృష్ణాడ్డి, ఉపాధ్యక్షులు వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షులు విశ్వనాథరెడ్డి, కృష్ణానాయక్‌, రామకృష్ణ ఉన్నారు.

డీఈఓకు వైఎస్సార్‌టీఏ వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement