బొమ్మనహాళ్: ప్రసిద్ధి చెందిన నేమకల్లు ఆంజనేయస్వామి బాలాలయంలో శ్రావణమాస బ్రహోత్సవాల్లో భాగంగా నాల్గో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. పవనపుత్రా పాహిమాం నామస్మరణ మార్మోగింది. ప్రత్యేక పుష్పాలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకులు వైద్యం అనిల్‌కుమార్‌స్వామి ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. విశేష పుష్పమాలలతో అలకరించారు. ఆకుపూజలు చేశారు. అనంతరం మహామంగళహారతి, ప్రసాద వినియోగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని బియ్యం, బేడలు, టెంకాయలు, పుష్పమాలలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రేట్ ఇండియా మైనింగ్ నేమకల్లు వారు భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ ఈఓ నరసింహారెడ్డి, అన్నదాన కమిటీ సభ్యులు భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు. బొమ్మనహాళ్ ఎస్‌ఐ నబీరసూల్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. హనుమాన్ భజనమండలి, భక్తమండలి సభ్యులు పల్లకీసేవ, భజనలు చేపట్టారు.
నేడు బ్రహ్మ రథోత్సవం
నేమకల్లు ఆంజనేయస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు శ్రీవారి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం 4.15 గంటలకు బ్రహ్మ రథోత్సవం ఉంటుందన్నారు. సాయంత్రం 7 గంటలకు లంకా దహనం ఉంటుందని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈఓ నరసింహారెడ్డి తెలిపారు.
మురడి అంజన్నకు శ్రావణమాస పూజలు
డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురడి ఆంజనేయస్వామికి శ్రావణ శనివారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు పవన్‌స్వామి ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహానివేదన నిర్వహించారు. ఆంధ్ర, కర్ణాటక నుంచి భక్తాదులు వేలాదిగా తరలివచ్చి, స్వామిని దర్శించుకున్నారు. ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి బందోబస్తు నిర్వహించారు.
విశేషాలంకరణలో మురడి ఆంజనేయుడు
నేమకల్లులో స్వామికి
ప్రత్యేక అలంకరణ
కసాపురంలో గరుడవాహనంపై ఊరేగుతున్న సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి, నేమకల్లులో స్వామి దర్శనం కోసం క్యూ కట్టిన భక్తులు
గరుడవాహనంపై నెట్టికంటుడు
గుంతకల్లు రూరల్: శ్రావణమాసం నాల్గవ శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం భక్తజనసందోహంతో కిటకిటలాడింది. భక్తిపారవశ్యంతో తన్మయత్వం పొందారు. వేకువజామునే ఆంజనేయస్వామికి అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేక పుష్పాలంకరణలో తీర్చిదిద్ధి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వార్లను గరుడ వాహనంపై కొలువుదీర్చి ఆలయ ఈఓ విజయరాజు, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివార్లను ఊరేగిస్తూ ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం నిర్వహించారు.


