కర్నూలు
(సెంట్రల్): తమ ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ పదవులు పొంది తమనే మరచిపోయారని ఆశావహ పోలీసు అభ్యర్థులు తీవ్ర ఆవేదన చెందారు. శుక్రవారం కర్నూలులో ఎస్‌ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని కోరుతూ కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్ కడప జిల్లాలకు చెందిన ఆశావహ పోలీసు అభ్యర్థులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి ఈ దీక్షలను అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నిరుద్యోగులు గ్రూపులుగా విడిపోయి నగరంలోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో ఉన్న ధర్నా చౌక్‌కు చేరుకొని దీక్షలను ప్రారంభించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా జాబ్ క్యాలెండర్‌లో ఒక్క పోస్టున్నీ భర్తీ చేయలేదన్నారు. పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులను కేవలం 1,600 చూపడం అన్యాయమన్నారు. అసెంబ్లీలో హోంశాఖా మంత్రి అనిత, డీజీపీ చెప్పిన విధంగా 11,639 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు.


