భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఉచిత నైపుణ్య శిక్షణ | - | Sakshi
Sakshi News home page

భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఉచిత నైపుణ్య శిక్షణ

Sep 4 2026 2:18 AM | Updated on Sep 4 2026 2:18 AM

అనంతపురం సిటీ: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు మెరుగైన భవిష్యత్‌ కల్పించేలా చర్యలు చేపట్టినట్లు జిల్లా కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్‌ లక్ష్మీనర్సయ్య తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లల కోసం రూపొందించిన ‘ఇండస్ట్రీ రెడీ’ ఆన్‌లైన్‌ వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను జిల్లా కార్మిక శాఖ కార్యాలయంలోని తన చాంబర్‌లో గురువారం ఆయన ఆవిష్కరించారు. పారిశ్రామిక అవసరాలకు తగిన మానవ వనరులను పెంపొందించేలా బృహత్‌ కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు లక్ష్మీనర్సయ్య తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో భవన నిర్మాణ కార్మికుల సభ్యత్వం కలిగిన వారి పిల్లలకు ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు తరఫున ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇప్పటికే డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌, మెడికల్‌ విభాగాల్లో చదువుతున్న కార్మికుల పిల్లలు ఇందుకు అర్హులన్నారు. శిక్షణ మొత్తం ప్రీ రికార్డెడ్‌ (ముందస్తుగానే నిక్షిప్తం చేసిన) వీడియోల ద్వారా సాగుతుందన్నారు. ఈ విధానం వల్ల పిల్లలు తాము ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు తమకు తీరిక ఉన్న సమయాల్లో ఇంటి వద్దనే ఉంటూ మొబైల్‌ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణ పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఏసీఎల్‌ శ్రీకాంత్‌నాయక్‌, అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ ఎస్‌.ఎన్‌.లావణ్య, సహాయ కార్మిక అధికారులు కె.రాధారమాదేవి, ఎం. సుజాత తదితరులు పాల్గొన్నారు.

పెళ్లి బస్సుపై రాళ్ల దాడి

వ్యక్తికి తీవ్ర గాయాలు

రాప్తాడు రూరల్‌: పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి రాయితో దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురం నగర శివారులోని సోములదొడ్డి వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా వీ.కోటకు చెందిన పెళ్లి బృందం బస్సులో గుంతకల్లుకు వెళ్లి వస్తుండగా సోములదొడ్డి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బస్సుపైకి రాయి దూసుకొచ్చింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న కృష్ణమూర్తి అనే వ్యక్తి నుదిటిపై పడటంతో తీవ్ర రక్తస్రావమైంది. ఏం జరిగిందో అర్థంకాక ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సును నిలిపి బయటకు వచ్చి చూడగా రాయి విసిరిన వ్యక్తి అక్కడ కనిపించలేదు. గాయపడిన కృష్ణమూర్తిని వెంటనే అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న అనంతపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ శ్రీకాంత్‌యాదవ్‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బస్సులోని ప్రయాణికులను, స్థానికులను విచారించారు.

రాయి దాడి వెనుక మిస్టరీ

ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గార్లదిన్నె సమీపంలో ఓ బస్సుకు, ద్విచక్ర వాహనదారుడికి మధ్య గొడవ జరిగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆ ద్విచక్ర వాహనదారుడు ఆ బస్సును వెంబడిస్తూ వచ్చి సోములదొడ్డి వద్ద రాయి విసిరినట్లు, అయితే లక్ష్యంగా చేసుకున్న బస్సుకు బదులుగా పొరపాటున వెనుక వస్తున్న పెళ్లి బస్సుపై రాయి పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు మతిస్థిమితం లేని వ్యక్తి రాయి విసిరి ఉండొచ్చనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీకాంత్‌యాదవ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement