నార్పల: కుటుంబ కలహాలతో మామపై వేటకొడవలితో అల్లుడు విచక్షణారహితంగా దాడిచేసిన ఘటన మండల కేంద్రమైన నార్పలలో కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు... నార్పలలోని తిక్కస్వామివీధిలో నివాసం ఉంటున్న చిలమకూరి పాముల రాజాకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు ముందే వివాహం జరిపించాడు. చిన్నకుమార్తె రమాదేవికి 18 నెలలు క్రితం లింగాల మండలానికి చెందిన శివయ్య కుమరుడు చరణ్‌తో పెళ్లి చేశారు. కుమార్తె గర్భిణి కావడంతో ప్రసవం కోసం పాముల రాజా తన ఇంటికి పిలుచుకుని వచ్చాడు. నెల రోజుల క్రితం రమాదేవి ప్రసవించింది. బిడ్డను చూసేందుకు చరణ్ తో పాటు అతని తండ్రి శివయ్య వచ్చారు. ఈ నేపథ్యంలో కుటుంబ విషయాల్లో వచ్చిన మనస్పర్థల కారణంగా చరణ్ ... తన మామ అయిన పాముల రాజాపై వేట కొడవలితో దాడి చేశాడు. దాడిలో రాజా కుడి చేతికి తీవ్ర గాయమైంది. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఆయన బయటకు పరుగులు తీశాడు. చరణ్ అంతటి అగకుండా రాజా వెంటాపడ్డాడు. గమనించిన స్థానికులు చరణ్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నారు. తీవ్రంగా గాయపడిన రాజాను వెంటనే అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా...పైళ్లెనప్పటి నుంచి తనను హింసిస్తున్నాడంటూ భర్త చరణ్‌పై భార్య రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


