అనంతపురం సెంట్రల్: ధ్యాస మళ్లించి ప్రయాణికులు, మహిళలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గుత్తి, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 60 లక్షలు విలువజేసే బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం పోలీసు కాన్ఫరెన్స్‌హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ జగదీష్ వివరాలు వెల్లడించారు. రాయదుర్గం మారెమ్మగుడి వీధికి చెందిన ఎరుకల రమణమ్మ, ఎరుకల గంగమ్మ, ఎరుకల సుంకమ్మ, డి.హీరేహాళ్ మండలం మురడికి చెందిన ఆనంద్, రాయదుర్గంలోని కనేకల్‌రోడ్డుకు చెందిన ఎరుకల సుంకమ్మ, గుత్తిలోని జెడ్ వీరారెడ్డి కాలనీకి చెందిన వనార్చి చిట్టెమ్మలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 40 తులాలు బంగారు, 100 గ్రాములు వెండి, రూ.1.49 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో వనార్చి చిట్టెమ్మ బ్యాగు లిఫ్టింగ్ నేరాల్లో సిద్ధహస్తురాలు. ఇటీవల టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన ముఠాలోనూ పట్టుబడింది. ఆర్టీసీ బస్టాండ్‌లు, రద్దీ ప్రాంతాలు, ఆటోల్లో ప్రయాణించే మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని, వారి వద్ద ఉన్న విలువైన బ్యాగులను చాకచక్యంగా అపహరించేవారు. ప్రయాణికుల్లా నటిస్తూ, వారికి ఆటంకం కలిగిస్తూ ధ్యాస మళ్లించి బ్యాగులు, పర్సులు, హ్యాండ్ బ్యాగుల్లో ఆభరణాలు దోచుకునేవారు. నిందితులందరూ ఒకరికొకరు పరిచయస్తులు, బంధువులు కావడం గమనార్హం. నిందితులపై గుత్తి పోలీసుస్టేషన్‌లో 11 కేసులు, అనంతపురం త్రీటౌన్, ఉరవకొండ పోలీసుస్టేషన్‌లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 13 కేసులు నమోదయ్యాయి. నిందితుల అరెస్ట్‌లో ప్రతిభచూపిన గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్, గుత్తి సీఐ రామారావు, సీసీఎస్ సీఐలు శేషగిరి, జయపాల్‌రెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


