● టీచర్లు, ఎంఈఓలతో ఎమ్మెల్యే అమిలినేని అల్లుడు ధర్మతేజ సమావేశం
● విస్తుపోయిన ప్రజాస్వామ్యవాదులు
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అమిలినేని సురేంద్రబాబు ఎన్నికై నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆయన అల్లుడు ధర్మతేజ చక్రం తిప్పుతున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ప్రొటోకాల్‌తో ఏమాత్రమూ సంబంధం లేకపోయినప్పటికీ అధికారిక వ్యవహారాల్లో ఆయన జోక్యం ఎక్కువ కావడంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా శనివారం అమిలినేని సొంత కార్యాలయ ప్రాంగణం (ప్రజావేదిక)లో ఎమ్మెల్యే అల్లుడు ధర్మతేజ సెప్టెంబర్ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవ ఏర్పాట్లపై నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎంఈఓలు, ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశాన్ని ఏ ప్రభుత్వ కార్యాలయంలోనో కాకుండా ఎమ్మెల్యే వ్యక్తిగత భవన ప్రాంగణంలో ఏర్పాటు చేయడం, అది కూడా ఎమ్మెల్యే అల్లుడి ఆధ్వర్యంలో నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రైవేట్ వ్యక్తి అధికారులను పిలిపించి ఆదేశాలివ్వడంతో ఉపాధ్యాయులు, అధికారులు విస్తుపోయారు. ఇక ఎమ్మెల్యే అల్లుడు చెప్పిందే వేదంగా భావిస్తున్న కొందరు అధికారులు మాత్రం ఆయన పిలవగానే ఆగమేఘాలపై అక్కడికి వెళ్లడంపై విద్యాశాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. ఎలాంటి రాజ్యాంగబద్ధ హోదా లేని వ్యక్తికి అధికారులు ఎందుకు సాగిల పడుతున్నారని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఎన్నికై న ప్రజాప్రతినిధి పరిపాలన చేయాలే గానీ..వారి బంధువులు అధికారం చెలాయించడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనని పలువురు మండిపడుతున్నారు.


