● ఉమ్మడి జిల్లాకు 14 మంది ఎమ్మెల్యేలు ఉండి ఏం ప్రయోజనం?
● రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపాటు
అనంతపురం ఎడ్యుకేషన్: నాలుగు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాలో నెలకొన్న కరువుపై 14 మంది ఎమ్మెల్యేలు గళం విప్పకపోవడం విచారకరమని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. శనివారం అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ చంద్రబాబును మరీ ఎక్కువగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత బస్సులో ఉండి పరిపాలించారని గొప్పగా చెప్పుకోవడం కాదని, అసలు రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఇచ్చిన లేఖ కూడా కారణమని ప్రకాష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతిలో కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి రూ.150 కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు. నాలుగు లేన్ల హైవే కిలోమీటరుకు రూ.10–15 కోట్లకు మించి ఖర్చు కాదన్నారు. అమరావతి నిర్మాణంలో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10–20 వేల కోట్లతో మావిగన్ రాజధాని పూర్తిచేయవచ్చని చెప్పినప్పుడు ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని గుర్తుచేశారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా రైతులు సాగుకు భయపడుతున్నారని తెలిపారు. రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ వేసి వేలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు. జిల్లాలో సుమారు 50 వేల బోర్లు ఎండిపోయాయన్నారు. మంత్రి సవిత అసెంబ్లీలో చంద్రబాబును బాగా పొగిడారని, అదే సమయంలో జిల్లాలోని రైతుల సమస్యలను ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. గాలేరు–నగరి నుంచి చిత్తూరు, కడప జిల్లాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా హంద్రీ–నీవా నీటిని అందించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని చంద్రబాబు అనధికారికంగా రద్దు చేశారని దుయ్యబట్టారు. మడకశిర బ్రాంచ్ కెనాల్ 40వ కిలోమీటరు నుంచి బైపాస్ కెనాల్‌కు నీళ్లు అందించే పథకానికి వైఎస్ జగన్ టెండర్లు పిలిచారని, ఆ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
సునీతమ్మా.. అది గొప్ప విషయం కాదు
పరిటాల సునీత అసెంబ్లీలో చెరువుల్లో 30 శాతం నీళ్లు నింపాలని అడగడంపై ప్రకాష్‌రెడ్డి స్పందించారు. హంద్రీ–నీవా లైనింగ్, పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆరోపించారు. పీఏబీఆర్ నుంచి పాపంపేట వరకు తాగునీరు అందించే పథకాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. కాంట్రాక్టర్లకు రూ.55 కోట్ల బకాయిలు చెల్లిస్తే ఆత్మకూరు, అనంతపురం రూరల్, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలకు తాగునీరు అందుతుందని చెప్పారు. స్థానిక నాయకులకు దోపిడీకి అవకాశం కల్పించే విధానాలకు బదులు శాశ్వత తాగునీటి పథకాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 2014–19 మధ్య తీవ్ర కరువుతో రైతులు కేరళకు వలస వెళ్లి భిక్షాటన చేసిన రోజులు మళ్లీ రాకుండా చూడాలని, మంత్రి పయ్యావుల కేశవ్ రైతుల ప్రయోజనాల కోసం నిలబడకుంటే ప్రజలు, రైతులు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజనేయులు, నాయకులు అంకే లక్ష్మన్న, మీనుగ నాగరాజు, పాపంపేట మాదన్నయాదవ్, భానుకోట శివ, కుర్లపల్లి ప్రణీల్‌రెడ్డి పాల్గొన్నారు.


