అనంతపురం అర్బన్: రాయలసీమ ప్రాంత ప్రజల న్యాయపరమైన ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని కర్నూలులో శాశ్వత హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామితో కలిసి విలేకరులతో ఆయన ఆయన మాట్లాడారు. కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదిస్తున్న సర్క్యూట్ బెంచ్‌లు, మొబైల్ కోర్టులు వంటి తాత్కాలిక విధానాలు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవన్నారు. రాయలసీమకు న్యాయ పరిపాలనలో సముచిత ప్రాధాన్యం కల్పించేందుకు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలన్నారు. కర్నూలులో బెంచ్ ఏర్పాటు అయితే రాయలసీమ ప్రజలకు న్యాయసేవలు మరింత చేరువగా ఉంటాయన్నారు. శాశ్వత హైకోర్టు బెంచ్ కోసం న్యాయవాదులు చేస్తున్న ఆందోళనలకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున, శ్రీరాములు, కేశవరెడ్డి, పద్మావతి, రమణ, తదితరులు పాల్గొన్నారు.
కలగళ్లలో జ్వరాల విజృంభణ
కూడేరు: మండల పరిధిలోని కలగళ్లలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. స్వరంతో పాటు ఒంటి నొప్పులు, దగ్గు, జలుబుతో బాధ పడుతున్నారు. అనేక కుటుంబాల్లో ఇంటికి ఒకరు లేదా ఇద్దరు చొప్పున తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రులను ఆశ్రయించినా జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఎదురెదురుగా
రెండు వాహనాల ఢీ
● పలువురికి గాయాలు
కళ్యాణదుర్గం: ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటన శనివారం కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు...కుందుర్పి మండలం ఎనుములదొడ్డి గ్రామం నుంచి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు 14 మంది తుపాన్ వాహనంలో అనంతపురం వెళ్తున్నారు. ఇదే సమయంలో కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా వైఎన్‌హెచ్ కోటకు చెందిన బంగారి అనే వ్యక్తి కారులో తన భార్యను అనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. బోరంపల్లి సోలార్ ప్లాంట్ వద్ద ఎదురెదురుగా ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బంగారి, అతని భార్యతో పాటు తుపాన్ వాహన డ్రైవర్ జిలాన్, పలువురు ఉపాధ్యాయులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని రూరల్ సీఐ గంగాధర్ తెలిపారు.
దాడి కేసులో నలుగురి అరెస్ట్
అనంతపురం సెంట్రల్: నగరంలో సోమనాథ్‌నగర్‌లో ఈనెల 20న చికెన్ సెంటర్ నిర్వాహకులపై దాడి చేసిన ఘటనలో నలుగురిని అరెస్ట్ చేశారు. వివరాలను శనివారం త్రీటౌన్ సీఐ కౌలుట్లయ్య మీడియాకు వెల్లడించారు. భవానీ నగర్‌కు చెందిన గుజ్జల దామోదర్, పెద్దపప్పూరు మండలం శింగనగుట్టపల్లికి చెందిన హరికృష్ణ, కనగానపల్లి మండలం పాతపాల్యం గ్రామానికి చెందిన హేమంత్‌కుమార్, యాడికి మండల కేంద్రానికి చెందిన బండిమేకల కార్తీక్‌ను అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఈ నెల 20న రాత్రి 8 గంటల సమయంలో అంకిత చికెన్ సెంటర్ ముందు మూత్ర విసర్జన చేస్తుండడంతో చికెన్ సెంటర్‌లో పనిచేస్తున్న పవన్‌కుమార్ అడ్డు చెప్పాడు. దీంతో సదరు యువకులు రాళ్లు, కట్టెలతో పవన్‌కుమార్, రమేష్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితులను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శనివారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కౌలుట్లయ్య వివరించారు.


