అనంతపురం: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ (సీయూఏపీ) అభివృద్ధికి వీసీ డాక్టర్ ఎస్‌ఏ కోరి తీసుకున్న చొరవను అనంతపురం మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య ప్రశంసించారు. వర్సిటీలో వీసీ ఎస్‌ఏ కోరిని రంగయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. వర్సిటీ అభివృద్ధి, విద్యార్థులకు అందుతున్న సౌలభ్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉన్నత విద్యా ప్రమాణాల పెంపునకు తీసుకుంటున్న చర్యలను వీసీ డాక్టర్ కోరి వివరించారు. జాతీయ స్థాయిలో యూనివర్సిటీ ప్రగతికి వీసీ డాక్టర్ ఎస్‌ఏ కోరి చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మాజీ ఎంపీ రంగయ్య అభినందించారు.
8వ రోజుకు జూడాల సమ్మె
అనంతపురం సిటీ: న్యాయపరమైన తమ డిమాండ్ల సాధనలో భాగంగా జిల్లా సర్వజనాస్పత్రిలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. పనికి తగినట్లుగా స్టైపెండ్ పెంచాలని, 2024 ఎన్నికల సమయంలో జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టి దాదాపు మూడో ఏడాది కావస్తున్నా హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పెరిగిన ఫీజులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సర్వజనాస్పత్రి ఆవరణలో ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, ఎమర్జెన్సీ విధులను జూడాలు రెండో రోజూ బహిష్కరించారు. దీంతో వైద్యులపై ఒత్తిడి పెరిగింది. ఇతర ప్రాంతాల నుంచి డిప్యూటేషన్‌పై వైద్యులను జీజీహెచ్‌కు రప్పించి, రోగులకు చికిత్సలు అందజేశారు.
‘సీమ’లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల్సిందే
అనంతపురం: రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల్సిందేనని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కోర్టు న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరించారు. అనంతపురం బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎన్.ఆదిశేషా రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. శ్రీభాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ‘సర్క్యూట్ బెంచ్ మాకొద్దు.. హైకోర్టు బెంచ్ ముద్దు’ అని పేర్కొన్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రాంత న్యాయవాదులు, కక్షిదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు నాగన్న, హరినాథ రెడ్డి, సతీష్, శ్రీనివాసులు, హజీజ్ తదితరులు పాల్గొన్నారు.
ఉరి వేసుకుని
వివాహిత ఆత్మహత్య
రాయదుర్గం రూరల్: మండలంలోని బొమ్మక్కపల్లి ఎస్సీ కాలనీకి చెందిన లేట్ మధు, మహదేవి దంపతుల చిన్న కుమార్తె అర్చన (26) ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. అర్చనను రామగిరి మండలం ఎగువపల్లికి చెందిన జగదీష్‌కు ఇచ్చి సంవత్సరం క్రితం వివాహం చేశారు. ఇటీవల అర్చన కడుపు నొప్పితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు పలు చోట్ల వైద్య చికిత్సలు చేయించినా తగ్గలేదు. కొన్ని రోజుల క్రితం తన పుట్టినిల్‌లైన బొమ్మక్కపల్లికి అర్చన వచ్చింది. తల్లి మహదేవి మంగళవారం ఉదయం కూలీ పనులకు వెళ్లగా.. అర్చన బాత్ రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమార్తె మృతదేహం వద్ద తల్లి కన్నీరుమున్నీరుగా విల పించడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది.
యువకుడి మృతి
పెనుకొండ రూరల్: యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు.. రొద్దం మండలం చోలేమర్రి గ్రామానికి చెందిన రామచంద్ర, అంజినమ్మ కుమారుడు అనిల్ (23) పెనుకొండ మండలంలోని మావటూరు గ్రామంలో తన అమ్మమ్మ రామాంజినమ్మ వద్ద ఉంటున్నాడు. కియా అనుబంధ పరిశ్రమ అయిన సియాన్ పరిశ్రమలో అనిల్ కార్మికుడిగా పనిచేసేవాడు. నిత్యం బస్సులో పరిశ్రమకు వెళ్లి వచ్చేవాడు. సోమవారం రాత్రి నైట్ షిఫ్ట్‌కు వెళుతున్నట్లు ఇంట్లో తెలిపి బయటకు వచ్చాడు. ఏమైందో తెలియదు కానీ, మంగళవారం ఉదయం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఒళ్లంతా కాలిన గాయాలతో విగతజీవిలా కనిపించాడు.


