చదువులు అటకెక్కినట్టే! | - | Sakshi
Sakshi News home page

చదువులు అటకెక్కినట్టే!

Aug 19 2026 1:18 AM | Updated on Aug 19 2026 1:18 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కారణంగా చదువులు అటకెక్కాయి. సమస్య పరిష్కారంలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడిచిన తర్వాత ప్రభుత్వం మేల్కొంది. టీచర్ల కొరత నేపథ్యంలో తాత్కాలికంగా అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించి బోధన అందించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలో మొత్తం 401 ఖాళీల్లో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో 222 పోస్టులు స్కూల్‌ అసిస్టెంట్‌, 179 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. అయితే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకూ ఇన్‌స్ట్రక్టర్లను కేటాయించకుండా.. అరకొరగానే నియమిస్తుండటంతో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌లోని సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల బోధన సక్రమంగా సాగడం లేదు.

అరకొర వేతనానికి వచ్చేదెవరు?

అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ప్రభుత్వం నిర్ణయించిన పారితోషికంపైనా హెచ్‌ఎంలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌జీటీ కేడర్‌కు రూ.10 వేలు, స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌కు రూ.12,500 చొప్పున మాత్రమే చెల్లించనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో మంచి సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయులకు ఇందుకు రెట్టింపు వేతనాలు లభిస్తున్నాయని అంటున్నారు.ప్రైవేట్‌ పాఠశాలల్లో మెరుగైన వేతనాలు లభిస్తున్న పరిస్థితుల్లో తక్కువ పారితోషికంతో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులకు ఎంతమంది ఆసక్తి చూపుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్‌ఎంలు పేర్కొంటున్నారు.

అనంతపురంలో పరిస్థితి దారుణం

అనంతపురం నగరపాలక పరిధిలోని ఉన్నత పాఠశాలల్లోనే దాదాపు 31 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు హెచ్‌ఎంలు చెబుతున్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా 14 మంది అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను మాత్రమే కేటాయించారు. ఎస్కేడీ కార్పొరేషన్‌ ఉన్నత పాఠశాలలో సోషల్‌, హిందీ, బయాలజీ సబ్జెక్టు టీచర్ల పోస్టులు ఖాళీగా ఉంటే ఒక్క అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ను కూడా కేటాయించలేదు. 15వ వార్డు నగరపాలక ఉన్నత పాఠశాలలో హిందీ పోస్టు ఖాళీగా ఉన్నా.. ఆ పోస్టుకు కూడా అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ను కేటాయించలేదు. శారదా బాలికల నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏకంగా 11 పోస్టులు ఖాళీగా ఉంటే ముగ్గురు అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను మాత్రమే కేటాయిస్తోంది. పాతూరు కస్తూర్బా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాలలో ఆరు పోస్టులు ఖాళీగా ఉండగా.. ముగ్గురు అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను మాత్రమే కేటాయిస్తున్నారు. ఇలా ఒక్క అనంతపురంలోనే కాదు జిల్లా అంతటా అరకొర పోస్టులు భర్తీ చేశారు.

జిల్లాలో టీచర్ల కొరత..

రెండు నెలల తర్వాత

మేల్కొన్న సర్కార్‌

అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకంలోనూ అరకొరే

సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement