అనంతపురం అగ్రికల్చర్: ఎల్–నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేశాడు. రెండు నెలలుగా ప్రార్థనలు, పూజలు, యాగాలు, భజనలు చేస్తున్నా కరుణ చూపడం లేదు. రైతులు మాత్రం వర్షం ఎప్పుడు కురుస్తుందా అని రోజూ ఆకాశానికేసి చూస్తూనే ఉన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కరువు కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ప్రధాన పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఇక వాటి స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగు కూడా కనిపించడం లేదు. మున్ముందు సాగునీరు అటుంచితే తాగునీటికి కూడా కటకటలు తప్పవనే ఆందోళన రేకెత్తిస్తోంది. పండ్లతోటలు, పట్టు, పశుపోషణ, పాడికి కూడా విఘాతం ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు చెబుతున్నారు. ఎల్–నినో అంటూ హెచ్చరికలతోనే దడ పుట్టిస్తున్న చంద్రబాబు సర్కారు... రైతులు, ప్రజలను ఆదుకునే చర్యలు మాత్రం చేపట్టడం లేదు.
28 మండలాల్లో తక్కువ వర్షాలు..
జూన్ మొదటి 15 రోజుల్లో కురిసిన వర్షాలతో సాధారణం నమోదైనా... 15 తర్వాత వరుణుడి జాడ కనిపించడం లేదు. జూన్ నుంచి ఇప్పటి వరకు (రెండున్నర నెలల్లో) 160 మి.మీ వర్షం పడాల్సి ఉండగా 35 శాతం లోటుతో 104.4 మి.మీ నమోదైంది. పెద్దవడుగూరు, యాడికి, పామిడి, పెద్దపప్పూరు... ఈ నాలుగు మండలాలు మినహా మిగతా 28 మండలాల్లో సాధారణం కన్నా తక్కువగా వర్షపాతం నమోదైంది. కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, గుమ్మఘట్ట, గుత్తి, తాడిపత్రి, వజ్రకరూరు, శింగనమల, పుట్లూరు, యల్లనూరు, నార్పల తదితర 11 మండలాల్లో సాధారణం కన్నా 50 నుంచి 65 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో ఖరీఫ్ కల్లోలమై కరువు ఛాయలు అలుముకున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రత్యామ్నాయం కూడా ప్రమాదంలో పడటం ఖాయమని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈసారి క్రాప్ హాలిడే ప్రకటించేంతగా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి.
వర్షం కోసం ప్రజల ఎదురుచూపు
కుందుర్పి: ఖరీఫ్‌లో భాగంగా మెట్ట భూముల్లో సాగు చేసిన వేరుశనగ తదితర పంటలు వర్షాభావ పరిస్థితులతో ఎండిపోతున్నాయి. కళ్యాణదుర్గం డివిజన్‌లో ఏటా 64 వేల హెక్లార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయి. ఈ ఏడాది ఎల్–నినో ప్రభావం కారణంగా తీవ్ర వర్షాభావం కారణంగా 31 వేల హెక్లార్లలో మాత్రమే సాగైనట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. వ్యవసాయ బోరుబావులు సగానికి సగం ఎండిపోయాయి. కుందుర్పి, శెట్టూరు మండలాల్లో వక్క, తమలపాకు తోటలు నీటితుడులు అందక వందలాది ఎకరాల్లో ఎండిపోతున్నాయి.
ఎండుతున్న పంటలు


