● ఉన్నట్లుండి కాలిపోతున్న వైనం
● లబ్ధిదారుల్లో ఆందోళన
బొమ్మనహాళ్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం పనుల్లో డొల్లతనం బట్టబయలైంది. పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సౌర విద్యుత్‌ను అందించి బిల్లుల భారాన్ని తగ్గించాలన్న ప్రభుత్వ సంకల్పానికి క్షేత్రస్థాయిలో కొందరు తూట్లు పొడుస్తున్నారు. ఇటీవల సూర్యఘర్ పథకంలో భాగంగా బొమ్మనహాళ్ మండలంలోని పలు ఎస్సీ కుటుంబాల ఇళ్లకు ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లలో మీటర్లు కాలిపోతుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఉద్దేహాళ్, గోనేహాళ్ గ్రామాల్లో ఎక్కువగా మీటర్లు కాలిపోవడం గమనార్హం. ఏర్పాటు చేసి వారం రోజులు కూడా గడవకముందే మీటర్లు కాలిపోయాయని వినియోగదారులు తెలిపారు. ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసి వాటిద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చన్న ఆశతో లబ్ధిదారులు యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. కొద్దిరోజులకే మీటర్లు కాలిపోతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు.
వైరింగ్ నాణ్యాతపై అనుమానాలు
సోలార్ యూనిట్ ఏర్పాటు సమయంలో వైరింగ్ నాణ్యత, కనెక్షన్ల బిగింపు, పరికరాల అమరికలో జాగ్రత్తలు కీలకం. నాణ్యత లేని వైరింగ్ వినియోగించడం షార్ట్‌సర్క్యూట్ సంభవించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం పేదలకు ఉచితంగా సౌర విద్యుత్ సదుపాయం కల్పిస్తుండగా, వాటి ఏర్పాటులో నాణ్యత లోపిస్తే పథకం ఉద్దేశమే దెబ్బతింటుందని పలువురు అంటున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


