రాయదుర్గంలో నిరాహార దీక్షలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నాయకులు
గుంతకల్లులో చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నాయకులు
ఉరవకొండలో దీక్ష చేస్తున్న పార్టీ యువజన, విద్యార్థి విభాగం నాయకులు
గుణపాఠం తప్పదు
టీడీపీ నేతల దౌర్జన్యం.. పోలీసుల ‘పచ్చ’పాతం
అనంతపురంలో రిలే దీక్షలను ఉద్దేశించి పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడారు. మెగా డీఎస్సీ పేరుతో దగా చేసి నిరుద్యోగుల జీవితాలతో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెలగాటమాడారని మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేక మంది అభ్యర్థులు నష్టపోయారన్నారు. విజయ వాడలో శాంతియుతంగా దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ, అతడి అనుచరులు దాడి చేయడం దారుణమన్నారు. నియంతల్లా వ్యవహరించిన వాళ్లు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారని, చంద్రబాబుకూ గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
అనంతపురం: దగా సర్కారుపై నిరుద్యోగుల్లో ఆగ్రహం పెల్లుబికింది. మెరిట్ లిస్ట్‌లో ఉన్నా టీచర్ ఉద్యోగం దక్కపోవడంతో ఆక్రోశం కట్టలు తెంచు కుంది. దారుణంగా మోసగించిన విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేసే వరకు ఉద్యమిస్తా మంటూ సమర శంఖం పూరించారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలకు విశేష స్పందన లభించింది. అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలికారు. యువత స్వచ్ఛందంగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు.
అనంతపురంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు దీక్షలో ఒకటో డివిజన్ నుంచి 13వ డివిజన్లకు చెందిన పార్టీ నాయకులు, యువత, నిరుద్యోగులు కూర్చున్నారు. దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్‌తో పాటు ఏఐవైఎఫ్ నేతలు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు.
నార్పల మండల కేంద్రంలోని పాత గాంధీ సర్కిల్– బస్టాండ్ ప్రాంతంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి, పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త శైలజానాథ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలని, అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గుంతకల్లులోని మున్సిపల్ ఆఫీసు ఎదుట రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి ప్రారంభించారు. దీక్షకు ఎమ్మెల్సీ శివరామి రెడ్డితో పాటు ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, వివిధ ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. జెన్‌జీ తరహా ఉద్యమం రుచి చూపిస్తామని హెచ్చరించారు.
ఉరవకొండలో విద్యార్థి, యువజన విభాగం నేతలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురంలోని ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద యువజన విభాగం నేతలు దీక్ష చేపట్టారు. పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి వీరికి మద్దతు తెలిపారు.
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎస్‌ఈసీ మెంబర్ గౌని ఉపేంద్రారెడ్డి డిమాండ్ చేశారు. రాయదుర్గంలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆదేశాల మేరకు నాయకులు దీక్ష చేపట్టారు.
డీఎస్సీ అక్రమాలపై పెల్లుబుకిన నిరసనాగ్రహం
వైఎస్సార్ సీపీ నిరసన దీక్షలకు విశేష స్పందన
స్వచ్ఛందంగా తరలివచ్చి
సంఘీభావం ప్రకటించిన యువత
లోకేష్ రాజీనామా చేసే వరకు ఉద్యమిస్తామని వెల్లడి


