అనంతపురం అర్బన్: నియోజకవర్గాల వారీగా మండలాలకు అదనపు ఏఈఆర్‌ఓలను భారత ఎన్నికల సంఘం నియమించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ తెలిపారు. ఇందుకు సంబంధించి గెజిట్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసిందన్నారు. ప్రస్తుతం ఉన్న ఏఈఆర్‌ఓలకు సహాయ ఏఈఆర్‌ఓలను నియమించారన్నారు.రాయదుర్గం,ఉవరకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, కళ్యాణదుర్గం, రాప్తాడు నియోజకవర్గాల్లో ఆయా మండలాల ఎంపీడీఓలను అదనపు ఏఈఆర్‌ఓలుగా నియమించారు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలో అనంతపురం రూరల్ డిప్యూటీ తహసీల్దారు, అనంతపురం రూరల్ ఎంపీడీఓ (స్వర్ణ గ్రామ అధికారి)ను నియమించారు.
నగర, పురపాలక సంఘాలకు..
అనంతపురం అర్బన్‌కు సంబంధించి అదనపు ఏఈఆర్‌ఓలుగా పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దారు, నరగపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్, పట్టణ ప్రణాళిక అధికారి, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్–1, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్–2ను నియమించారు. రాయదుర్గం మునిసిపాలిటీకి పట్టణ ప్రణాళిక పర్యవేక్షకుడు, గుంతకల్లు అర్బన్‌కు అసిస్టెంట్ సిటీ ప్లానర్, గుత్తి అర్బన్‌కు మునిసిపల్ అసిస్టెంట్ ఇంజినీర్‌ను నియమించారు. తాడిపత్రి అర్బన్‌లో మునిసిపల్ డిప్యూటీ ఇంజినీర్, కళ్యాణదుర్గం అర్బన్‌లో పట్టణ ప్రణాళిక అధికారి నియమితులయ్యారు.
టీబీ డ్యాంలో
64 టీఎంసీల నీరు
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయంలో 64.816 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. బుధవారం నాటికి 1,00,700 క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో గురువారం నాటికి 60,751 క్యూసెక్కులకు తగ్గింది. జలాశయం ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి, చిక్కమగళూరు, వరనాడులో ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండడంతో వరద డ్యాంకు చేరుతోంది. ఈ క్రమంలో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 1,633 అడుగుల మట్టానికి గాను 1,621.22 అడుగులకు నీరు చేరింది. ఇన్‌ఫ్లో 60,751 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,499 క్యూసెక్కులుగా నమోదైంది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 64.816 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
సీఐ వ్యవహారంపై విచారణ
హిందూపురం టౌన్: పట్టణ సీఐ రాజగోపాల్‌నాయుడి వ్యవహార శైలి, వెల్లువెత్తుతున్న ఆరోపణలపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ ముమ్మరం చేశారు. సీఐ రాజగోపాల్ నాయుడు అధికార టీడీపీతో అంటకాగుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును వివరిస్తూ పురంలో ‘పచ్చ’ పోలీసు శీర్షికన ఈ నెల 2వ తేదీన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సీఐ రాజగోపాల్ నాయుడు వ్యవహార శైలి, ఇటీవల ఓ దళిత లాయరుపై బూటుకాలితో ఆయన చేసిన దాడి తదితర వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆదేశించారు. అంతే కాకుండా కదిరి డీఎస్పీ శివన్నారాయణస్వామిని విచారణాధికారిగా నియమించారు.
లాయరునే బూటుకాలితో తన్నిన సీఐ
ఇటీవల గర్భిణి రమ్యశ్రీ హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుకూ మృతి చెందింది. బాధితుల తరఫున అక్కడికి వచ్చిన దళిత న్యాయవాదిపై సీఐ రాజగోపాల్ నాయుడు దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడి బూటుకాలితో తన్నారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారగా, దళిత, బహుజన, ప్రజా సంఘాల నాయకులతో పాటు న్యాయవాదులు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఐ రాజగోపాల్‌నాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎస్పీ సతీష్‌కుమార్‌కు కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు సీఐ వ్యవహారశైలిపై ‘సాక్షి’ ప్రచురించిన కథనం నేపథ్యంలోనే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. కదిరి డీఎస్పీ శివన్నారాయణస్వామి గురువారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, ఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బందితో విచారణ చేపట్టారు.


