వేదనే మిగులుతు‘న్నది’! | - | Sakshi
Sakshi News home page

వేదనే మిగులుతు‘న్నది’!

Aug 7 2026 1:50 AM | Updated on Aug 7 2026 1:50 AM

బెళుగుప్ప: అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. బెళుగుప్ప మండల పరిధిలోని కాలువపల్లి, వీరాంజనేయకొట్టాల, జీడిపల్లి వద్ద పెన్నానది పరివాహక ప్రాంతంలో ఇసుకను అక్రమార్కులు తోడేస్తున్నారు. నరసాపురం, బ్రాహ్మణపల్లి, రమనేపల్లి, బూదివర్తి, గుండ్లపల్లి వద్ద హగిరి నది పరివాహక ప్రాంతం నుంచి కూడా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. హగిరి, పెన్నా పరివాహక ప్రాంతాల నుంచి నిత్యం 200కు పైగా ట్రాక్టర్ల ఇసుక తరలిపోతోంది. ట్రాక్టర్‌ ఇసుకను రూ.1,500 నుంచి రూ.3,000 వరకూ విక్రయిస్తూ జేబుల్లోకి వేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం చూసీ చూడనట్టు పోతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పర్యావరణానికే ముప్పు

బెళుగుప్ప మండల పరిధిలో తూర్పున ప్రవహించే పెన్నా, పశ్చిమాన ప్రవహించే హగిరి నదులే పంటల సాగుకు ఊతంగా వుండేవి. గతంలో వర్షాలు బాగా కురవడంతో నీటి ప్రవాహం మూలంగా ఇసుక వచ్చి చేరేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక వరుణుడు మొఖం చాటేసి వర్షాలే కరువయ్యాయి. ఇదే సమయంలోనే అధికార పార్టీ నాయకులు నదుల్లోని ఇసుకను తోడేయడంతో నీరు ఇంకక భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వట్టిపోతున్నాయి. ఈ క్రమంలో రైతులు లబోదిబోమంటు న్నారు. మితిమీరి ఇసుకను తోడేస్తుండడం మూలంగా పర్యావరణానికే ముప్పు పొంచి ఉందని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్నారు.

పంటల సాగు కష్టమైంది

వేదవతి, హగిరి పరివాహక ప్రాంతం నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోరుబావులు వట్టిపోతున్నాయి. అరకొర నీటితో బోరుబావుల కింద పంటలను కాపాడుకోవడం కష్టంగా మారింది.

– భాస్కర్‌రెడ్డి, నక్కలపల్లి, రైతు

అధికారులు స్పందించాలి

కాలువపల్లి సమీపంలోని పెన్నా నది గుంతలమయంగా మారింది. ఇసుక తరలింపుతో భూగర్భజలాలు అడుగంటి పెన్నా పరివాహక ప్రాంతంలో చాలా మంది రైతుల బోర్లు వట్టిపోయాయి.అధికారులు స్పందించాలి.

– మల్లారెడ్డి, కాలువపల్లి

అనుమతులు ఇవ్వలేదు

హగిరి, వేదవతి, పెన్నా పరివాహక ప్రాంతాల నుంచి ఇసుకను తరలించేందుకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. గృహ నిర్మాణ అవసరాలకు మాత్రం ఇసుకను ట్రాక్టర్లలో తరలించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇసుకతో వ్యాపారం చేస్తే చర్యలు తప్పవు. ఇసుక అక్రమ రవాణాపై పోలీసులతో కలిసి నిఘా పెడతాం. – అనిల్‌కుమార్‌, బెళుగుప్ప తహసీల్దార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement