‘హిత’ ఎండీ లక్ష్మీనాయుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

‘హిత’ ఎండీ లక్ష్మీనాయుడి అరెస్టు

Aug 7 2026 1:50 AM | Updated on Aug 7 2026 1:50 AM

యువకుడి మృతి కేసులో

అతనితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

పరారీలో మరో నిందితుడు

అనంతపురం సెంట్రల్‌: యువకుడి మృతి కేసులో నగరంలోని హిత ఆస్పత్రి ఎండీ లక్ష్మీనాయుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్థానిక త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కౌలుట్లయ్యతో కలిసి డీఎస్పీ చంద్రశేఖర్‌ వివరాలు వెల్లడించారు. నార్పల మండలం రంగాపురానికి చెందిన మెల్లంపుటి లక్ష్మీనాయుడు, హిందూపురంలోని లక్ష్మీపురానికి చెందిన షేక్‌ కరీముల్లాషాలు నగరంలో రైల్వేస్టేషన్‌కు సమీపంలో హిత హాస్పిటల్‌ నిర్వహిస్తున్నారు. ఇదే ఆసుపత్రి లో తాడిమర్రి మండలం రంగాపురానికి చెందిన దబ్బర అశోక్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేసే వాడు. గత నెల 22న అశోక్‌ తనకు వాట్సాప్‌ ద్వారా అసభ్యకర మెసేజ్‌లు పంపినట్లు కరీముల్లా షాకు లక్ష్మీనాయుడి భార్య చెప్పింది. దీంతో కరీముల్లా షా, లక్ష్మీనాయుడు, వారి వద్ద డ్రైవర్‌గా పనిచేసే దాసరి కార్తీక్‌లు గత నెల 31న అశోక్‌ను హిత హాస్పిటల్‌ మూడో అంతస్తులోని ఓ గదిలోకి తీసుకెళ్లారు. టీవీ టవర్‌ ప్రాంతానికి చెందిన క్రాంతికుమార్‌ ద్వారా అశోక్‌ను కొట్టడానికి రీపర్‌ కట్టెలు, వాటర్‌ పైపులు తెప్పించుకున్నారు. తొలుత లక్ష్మీనాయుడు, కరీముల్లా షా అశోక్‌ను చితకబాదగా.. తర్వాత కార్తీక్‌ను కూడా పిలిపించుకొని అశోక్‌ బట్టలు ఊడదీసి విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిని లక్ష్మీనాయుడు తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. ఈ క్రమంలోనే దెబ్బలు భరించలేని అశోక్‌ ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి కిందికి దూకాడు. చెట్టుకొమ్మలు, ఇంట ర్నెట్‌ తీగలు పట్టుకోవడంతో నెమ్మదిగా భూమిపైకి పడిన అతను గాయాలతోనే పక్క సందులోకి పరుగెత్తాడు. చికిత్స కోసం అశోక్‌ బయటకు వెళితే విషయం అందరికీ తెలుస్తుందని భావించిన క్రాంతికుమార్‌..అశోక్‌ను మళ్లీ ద్విచక్రవాహనంలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెంటిలేటర్‌పై చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే అశోక్‌ మృతి చెందాడు. సాక్ష్యాలు లభ్యం కాకుండా మూడో అంతస్తులోని గదిని నిందితులు శుభ్రం చేయించారు. దాడికి వినియోగించిన కట్టెలు, పైపులు దాచి పెట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అన్ని విషయాలు వెలుగులోకి వచ్చినట్లు డీఎస్పీ వివరించారు. దాడికి ఉపయోగించిన కట్టెలు, వాటర్‌ పైపు, నాలుగు సెల్‌ఫోన్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు కార్తీక్‌ను త్వరలోనే పట్టుకుంటామన్నారు. పై అంతస్తు నుంచి దూకడం వల్లే అశోక్‌ చనిపోయాడా లేక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో మరేదైనా జరిగిందా అనే అంశంపై పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఏ–1 నిందితుని సెల్‌ఫోన్‌లో ఉన్న అసభ్యకర వీడియోలు, హిత హాస్పిటల్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న అంశాలపై కూడా విచారణ చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement