బెళుగుప్ప: మండల పరిధిలోని కోనాపురం క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఎస్‌ఐ శివ తెలిపిన మేరకు.. కణేకల్లు మండలం సొల్లాపురానికి చెందిన సాలమ్మ (36) అనంతపురంలో నివాసం ఉంటోంది. మంగళవారం రాత్రి తన బంధువు మల్లికార్జునతో కలిసి ద్విచక్ర వాహనంపై ఎర్రగుడిలో జరుగుతున్న శుభ కార్యంలో పాల్గొనేందుకు వెళ్తుండగా, కోనాపురం వద్ద బైకు అదుపుతప్పి ఇద్దరూ కిందపడ్డారు. ప్రమాదంలో సాలమ్మ తలకు తీవ్రగాయాలు కాగా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాలమ్మ మృతి చెందింది. ఘటనపై మృతురాలి భర్త హరిజన రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ పేర్కొన్నారు.
గుంతలోకి దూసుకెళ్లిన 108
● గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఘటన
బ్రహ్మసముద్రం: గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఓ 108 అంబులెన్స్ అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లింది. వివరాలు.. మండలంలోని చెలిమేపల్లి గొల్లలదొడ్డి గ్రామానికి చెందిన గర్భిణి బసమ్మతో పాటు ఆమె తల్లి సరస్వతిని 108లో కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోని భైరసముద్రం సమీపంలో స్టీరింగ్ రాడ్ కట్ అయ్యింది. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. గర్భిణి బసమ్మ తలకు, ఆమె తల్లి సరస్వతికి తీవ్ర గాయాలయ్యాయి. 108 డ్రైవర్ ఇషాక్, ఈఎంటీ అంజి స్వల్పంగా గాయపడ్డారు. బసమ్మను వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
వివాహిత ఆత్మహత్య
గార్లదిన్నె: వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని కల్లూరులో జరిగింది. ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపిన మేరకు.. కల్లూరుకు చెందిన మహేంద్ర, శిరీష (22) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల మహేంద్ర పేటీఎం ద్వారా రూ.2 లక్షల అప్పు తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న శిరీష తనకు తెలియకుండా లోన్ తీసుకోవడంపై భర్తతో గొడవ పడింది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూపర్ వాస్మాయిల్ తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శిరీష మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
1,127 మందికి ‘తల్లికి వందనం’ పెండింగ్
అనంతపురం న్యూ టౌన్: జిల్లాలో ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంకా 1,127 మందికి నగదు అందలేదని అధికారులు గుర్తించారు. సమస్యను పరిష్కరించేందుకు గ్రామ, పట్టణ ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సచివాలయాల వారీగా ఆయా విద్యార్థుల డేటా సేకరిస్తున్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 77 మంది, గుంతకల్లు– 122, కళ్యాణదుర్గం–135, రాప్తాడు–164, రాయదుర్గం–158, శింగనమల–139, తాడిపత్రి–180, ఉరవకొండ నియోజకవర్గంలో 152 మందికి డబ్బు అందలేదని వెల్లడైంది. ఈ విషయంపై స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు జిల్లా అధికారి జి. నాసరరెడ్డి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అర్హత ఉన్న ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకుండా చూస్తామన్నారు. బాధితులు సంబంధిత సచివాలయాలలో తగిన వివరాలతో ఆగస్టు మూడులోపు ఫిర్యాదు చేయాలని కోరారు.
మృతి చెందిన హరిజన సాలమ్మ


