రాయదుర్గం: పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లే అమ్మలకు కడుపు‘కోత’ మిగుల్చుతున్నారు. కాసులకు కక్కుర్తిపడి ఏదో ఓ కారణం చెప్పి సిజేరియన్లు చేస్తున్నారు. జిల్లాలో గత ఏడాదిగా ప్రసవాల సంఖ్య చూస్తే సగం దాకా శస్త్రచికిత్స కాన్పులు ఉండడం ఆందోళన కలిగించే అంశం. సిజేరియన్ కాన్పులు అరికట్టేందుకు చర్యలు చేపట్టాల్సిన పాలకులు, అధికారులు సమీక్షలతోనే సరిపెట్టేస్తున్నారు. ఫలితంగా ‘అమ్మ’కు అ‘ధనపు’ కష్టం తెచ్చిపెడుతున్నారు. కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రమే సిజేరియన్లు చేయాలి. ఇవి మొత్తం కాన్పుల్లో 25 శాతం మించకూడదు. సుఖ ప్రసవానికి వీలు లేనప్పుడు, కడుపులో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, అధిక రక్తాస్రావం, నియంత్రించలేనంతగా మూర్ఛ వచ్చినప్పుడు, బిడ్డకు గుండె సమస్య, తల్లీబిడ్డ ప్రాణాలకు ప్రమాదం ఉన్న సందర్భాల్లో మాత్రమే శస్త్రచికిత్సలు చేయాలి. దీనికి భిన్నంగా ప్రైవేటు, అనంతపురం సర్వజన ఆస్పత్రుల్లో సిజేరియన్లు నమోదు కావడం గమనార్హం. వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే సిజేరియన్లు పెరగడానికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వాస్పత్రిలోనూ అదే తీరు..
అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు మొత్తం 6,421 కాన్పులు జరిగాయి. ఇందులో ఏకంగా 3,710 సిజేరియన్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులకే ప్రాధాన్యత ఇస్తాం. తల్లీబిడ్డల సంక్షేమానికి పాటుపడతాం’ అంటూ పాలకులు చెప్పే మాటలు ఒట్టివేనని తేలింది.
ప్రైవేటులో కోతలు.. వాతలే!
జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చూస్తే ఆందోళన కలిగిస్తోంది. 131 ప్రైవేట్ ఆస్పత్రుల్లో 17,396 కాన్పులు జరిగితే, అందులో 8,679 సిజేరియన్లు ఉన్నాయి. 49.89 శాతం సిజేరియన్ ప్రసవాలు నమోదు కావడం గమనార్హం. కాసుల కోసం కక్కుర్తి పడి చేసే సిజేరియన్ల వల్ల కడుపు కోతతో బాలింతలు భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
అవగాహన కల్పిస్తున్నాం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాల సంఖ్య పెంచడానికి కృషి చేస్తున్నాం. జిల్లాలోని 45 పీహెచ్‌సీల్లో 909 కాన్పులు జరిగితే ఒక్క సిజేరియన్ కూడా జరగలేదు. ప్రత్యేక సదస్సులు ఏర్పాటుచేసి అవగాహన కల్పిస్తున్నాం. వైద్యాధాకారులతో పాటు సిబ్బందికి సమావేశాలు నిర్వహిస్తూ సూచనలు చేస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రులను తరచూ తనిఖీలు చేస్తూ సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశిస్తున్నాం. ఎక్కువ సిజేరియన్లు చేసే ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రసవానికి ప్రభుత్వాస్పత్రులే మేలు. వంద శాతం సుఖ ప్రసవాలకే ప్రాధాన్యత ఇస్తాం.
– ఈబీ దేవి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, అనంతపురం
ఎందుకు ఎక్కువంటే...?
క్రిటికల్ పరిస్థితులు ఉన్న కేసుల్లో తప్పనిసరిగా సిజేరియన్ చేస్తున్నాం. సుఖ ప్రసవానికి అవకాశమున్న కేసుల్లో కొందరు భర్తలు తమ భార్యల ప్రసవ వేదనలను చూడలేక సిజేరియన్ చేయండని ప్రాధేయపడిన సందర్భంలో చేయాల్సి వస్తోంది. ఇంకొంతమంది అయితే సుముహూర్తాలు, శుభ ఘడియలు చూసుకుని పలానా తేదీనే చేయాలని కోరుతున్నందున కాదనలేని పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తున్నాం. అంతే తప్ప ఇక్కడ డబ్బుల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ సిజేరియన్ చేయడం లేదు. ఇది కూడా ఇక నుంచి నిబంధనలకు లోబడే ఉండేలా చూసుకుంటాం.
– మల్లీశ్వరి, సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి
అదే పనిగా చేస్తే సీజ్ చేస్తాం
ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా అదే పనిగా సిజేరియన్లు చేస్తే చర్యలు తీసుకుంటాం. అవసరమైతే సదరు ఆస్పత్రులను సీజ్ చేస్తాం. అలాగే ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్ల సంఖ్య తగ్గించడానికి కృషి చేస్తున్నాం. – డేవిడ్, డీసీహెచ్‌ఎస్
రాయదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్డులో నివాసం ఉండే ఓ మైనార్టీ మహిళ ఇటీవల ప్రసవం కోసం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ పరీక్షించిన వైద్యులు రక్తం తక్కువగా ఉందని చెప్పారు. ఆ తర్వాత సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయాలని తెలిపారు. సుమారు రూ.30 వేల దాకా ఖర్చులు వచ్చాయి. ఇలా ఈ ఒక్క కేసే కాదు.. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏడాది వ్యవధిలో 8,679 సిజేరియన్ ప్రసవాలు జరిగాయి.
జిల్లాలో పెరుగుతున్న
సిజేరియన్ ప్రసవాలు
తగ్గుతున్న సాధారణ
ప్రసవాల సంఖ్య
కాసులకు కక్కుర్తి..
కొరవడిన పర్యవేక్షణ


