కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం అటవీ శాఖ సిబ్బంది తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రజాధనంతో నిర్మించిన నగరవనం పార్కును పర్యవేక్షించాల్సిన సిబ్బంది తమ బాధ్యతలను విస్మరించి సందర్శకుల పట్ల నిర్లక్ష్యంగా, దురుసుగా ప్రవర్తిస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో నగరవనానికి వందలాది మంది సందర్శకులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. అయితే నిర్దేశిత సమయం కంటే ముందే అటవీ శాఖ సిబ్బంది టికెట్ కౌంటర్‌ను మూసేశారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి పిల్లలతో కలిసి వచ్చిన సందర్శకులు తీవ్ర నిరాశ చెందారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం..అధికారులు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకపోవడంతో వందలాది మంది నగరవనం బయటే పడిగాపులు కాశారు. రోజుకు రెండు వేల టికెట్లు మాత్రమే ఇస్తామని అటవీ శాఖ సిబ్బంది చెప్పడంతో మిగిలినవారు నిరాశతో వెనుదిరిగారు.
సందర్శకులపై దూషణలు
ముందస్తుగానే టికెట్లు ఎందుకు క్లోజ్ చేశారంటూ ప్రశ్నించిన యువకులపై అటవీ శాఖ సిబ్బంది నోరు పారేసుకున్నారు. బూతు పురాణం అందుకోవడమే కాకుండా ‘వీడియో కాకపోతే ఏమైనా రికార్డు చేసుకో..ఎవ్వరికి పంపుతావో పంపుకో..భయపడేది లేదు..మీకు చేతనైంది చేసుకోండి’ అంటూ దౌర్జన్యానికి దిగారు. ఒక దశలో బీట్ ఆఫీసర్ నాగే నాయక్ తన ప్యాంట్ బెల్టు ఊడదీసి సందర్శకులను కొట్టేందుకు వెళ్లారు. ఆయన తీరుపై సందర్శకులు మండిపడ్డారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సందర్శకులపై దుర్భాషలు
వీడియో కాకపోతే చేతనైంది చేసుకోండంటూ యువకులపై దౌర్జన్యం
బెల్టు పట్టుకుని సందర్శకులను
భయపెట్టిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
అనుమతి లేకపోవడంతో నిరాశతో
వెనుదిరిగిన వందలాది మంది


