భూగర్భజలాలు ఢమాల్‌ | - | Sakshi
Sakshi News home page

భూగర్భజలాలు ఢమాల్‌

Jul 13 2026 4:19 AM | Updated on Jul 13 2026 4:19 AM

అనంతపురం అగ్రికల్చర్‌: జూన్‌ నుంచి అక్టోబర్‌ ఆఖరు వరకు వర్షాకాలం సీజన్‌ ఉంటుంది. ఆ తర్వాత డిసెంబర్‌ నుంచి చలి మొదలవుతుంది. ఈ ఐదు నెలల్లో కురిసే వర్షాలపై ఖరీఫ్‌, రబీ పంటల సాగు ఆధారపడి ఉంటుంది. ఏడాది పొడవునా జిల్లా వార్షిక వర్షపాతం 514.2 మి.మీ కాగా అందులో జూన్‌ నుంచి అక్టోబర్‌ మధ్య ఐదు నెలల కాలంలోనే సాధారణంగా 422.2 మి.మీ వర్షం కురవాలి. మిగతా ఏడు నెలల కాలంలో కేవలం 92 మి.మీగా గుర్తించారు. భూగర్భజలాలు పెరగాలంటే ఈ ఐదు నెలలు కీలకం. అయితే అందుకు అనుగుణంగా వరుణుడు కరుణించడం లేదు. దీంతో భూగర్భజలాలు ఒక్క ఇంచు కూడా పైకి రాని పరిస్థితి నెలకొంది. జూన్‌ 15 తర్వాత దాదాపు నెల కావస్తున్నా ఎక్కడా పట్టుమని 10 మి.మీ మేర తేలికపాటి వర్షం కూడా కురవలేదు.

భయపెడుతున్న భూగర్భజలాలు..

జిల్లా వ్యాప్తంగా 94 ప్రాంతాల్లో ఉన్న ఫిజోమీటర్ల నుంచి భూగర్భజలశాఖ తాజాగా సేకరించిన గణాంకాల ప్రకారం తాజా సగటు నీటిమట్టం 13.61 మీటర్లుగా నమోదైంది. వర్షాకాలంలో 10 మీటర్లకు చేరుకుంటాయని భావించగా... ఈ స్థాయిలో ఉండటం ఆందోళన కలిగించేదిగా భావిస్తున్నారు. ఇదే పరిస్థితి మరికొద్ది రోజులు కొనసాగితే మున్ముందు పశుగ్రాసం లేక పాడి, పశుపోషణకు విఘాతం కలగవచ్చంటున్నారు. అలాగే పట్టు, పండ్లతోటల మనుగడకు కష్టమనే ఆందోళన వ్యక్తమవుతోంది. సగటు నీటిమట్టం 13.61 మీటర్లుగా నమోదైనా... మరికొన్ని ప్రాంతాల్లో ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. యాడికి మండలం నగరూరు ఫిజోమీటర్‌లో భూగర్భజలాలు ఏకంగా 69.95 మీటర్లకు క్షీణించిపోవడం చూస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. అలాగే కుందుర్పి మండలం ఎర్రగుంటలో 53.18 మీటర్లు, శెట్టూరు మండలం చెర్లోపల్లి ఫిజోమీటర్‌లో 43.92 మీటర్లు, అనుంపల్లిలో 40.4 మీటర్లు, పుట్లూరులో 40.4 మీటర్లు, యాడికి మండలం కోనుప్పలపాడులో 38 మీటర్లు, రాయలచెరువులో 36.5 మీటర్లు, కళ్యాణదుర్గం బట్టువానిపల్లిలో 31.1 మీటర్లు.... ఇలా చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి.

డేంజర్‌ బెల్స్‌..

పరిమితికి మించి నీటి వినియోగం, వర్షాభావ పరిస్థితుల కారణంగా కళ్యాణదుర్గం, శెట్టూరు, యాడికి, కుందుర్పి, పుట్లూరు మండలాలు డేంజర్‌ జోన్‌లో కొనసాగుతున్నాయి. వీటితో పాటు గుత్తి, బెళుగుప్ప, డి.హీరేహాళ్‌, కణేకల్లు, రాయదుర్గం, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం, తాడిపత్రి, కూడేరు, పామిడి, శింగనమల, యల్లనూరు తదితర మండలాల్లో కూడా క్రమంగా నీటిమట్టం తగ్గుముఖం పట్టినట్లు గుర్తించారు. ఎల్‌–నినో ఉన్నందున వర్షాలు గతితప్పుతుండటంతో మున్ముందు తాగునీటి కటకటలు, సాగునీటి ఇక్కట్లు ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీనికితోడు కరువును ఎదుర్కొనే కార్యాచరణ ప్రణాళికలను చంద్రబాబు సర్కారు అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు.

ఎల్‌–నినో ఎఫెక్ట్‌..

సమృద్ధిగా కురవని వర్షాలు

డేంజర్‌ జోన్‌లో ఐదు మండలాలు

మరికొన్ని మండలాల్లో

తగ్గుతున్న భూగర్భ జలాలు

జిల్లా తాజా నీటిమట్టం

13.61 మీటర్లుగా నమోదు

జిల్లాలో తాగు – సాగునీటికి

పొంచి ఉన్న కష్టాలు

నైరుతి రుతుపవనాలపై ఎల్‌–నినో ఎఫెక్ట్‌ స్పష్టంగా కనిపిస్తోంది. సోమాలియాజెట్‌, ఎంజేవో లాంటి వాతావరణ పరిస్థితులు కూడా ప్రతికూలంగా ఉండటంతో వరుణుడు కరుణించడం లేదు. ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదు కావడం లేదు. 20 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఉక్కపోత కొనసాగుతోంది. ఇలా విచిత్రమైన వాతావ‘రణం’ మధ్య జిల్లాలో లో ఒకవైపు లక్షల ఎకరాల ఖరీఫ్‌ అల్లకల్లోలమవుతుండగా... మరోవైపు భూగర్భజలాలు అడుగంటుతుండటం రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement