అనంతపురం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను సోమవారానికి బదులుగా ఈ నెల 15న నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్ ఫారాలు స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ 14 తేదీతో ముగుస్తుందని, ఈ ప్రక్రియలో చివరి దశ 13, 14 తేదీలు చాలా కీలకమని పేర్కొన్నారు. ఈ రెండు రోజులు అధికారులు, సిబ్బంది పూర్తిగా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో 13న నిర్వహించాల్సిన పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌ను 15వ తేదీన ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సోమవారం కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు.
నేడు డయల్ యువర్
ఎస్పీడీసీఎల్ సీఎండీ
అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు 89777 16661 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ సర్వీస్ నంబర్‌ను తప్పకుండా తెలియజేయాలని పేర్కొన్నారు.
జిల్లాలో డయల్ యువర్ ఎస్‌ఈ..
జిల్లాలో డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. వినియోగదారులు 08554– 272943, 91547 90350 నంబర్లకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.
15 నుంచి క్రీడా వేడుకలు
అనంతపురం టౌన్: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 15 నుంచి ఆగస్టు 25 వరకు క్రీడా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు క్రీడా ప్రాధికార సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 1 నుంచి 15 వరకు జిల్లాస్థాయి పోటీలు, ఆగస్టు 20 నుంచి 25 వరకు రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడా దినోత్సవంలో భాగంగా వివిధ రకాల అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, యోగా, బాక్సింగ్ తదితర క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు www.sports.ap. gov.inలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.


