అమ్ముకుంటాం.. అడిగేవారెవరు..? | - | Sakshi
Sakshi News home page

అమ్ముకుంటాం.. అడిగేవారెవరు..?

Jul 13 2026 4:19 AM | Updated on Jul 13 2026 4:19 AM

బ్రహ్మసముద్రం : గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం మంజూరు చేసిన స్వచ్ఛభారత్‌ ట్రాక్టర్లు కనిపించడం లేదు. అధికార తెలుగుదేశం పార్టీ నేతలు తమ అధీనంలో ఉంచుకుని సొంతానికి వాడుకోవడమే కాకుండా.. కొందరు వాటిని అమ్మేసి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు. చెత్త తరలింపు ప్రక్రియ సాగక ఎక్కడపడితే అక్కడ పేరుకుపోయి కంపు కొడుతోంది. స్వచ్ఛ భారత్‌ పథకం కింద మండలంలోని పాలవెంకటాపురం, బ్రహ్మసముద్రం, భైరవానితిప్ప, సంతేకొండాపురం, పిల్లలపల్లి గ్రామాలకు మొత్తం ఐదు ట్రాక్టర్లు మంజూరయ్యాయి. గ్రామ పంచాయతీ పరిధిలో ఉండాల్సిన ఈ వాహనాలు అడ్రస్‌ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వారినే అడగండి..

పిల్లలపల్లి గ్రామ పంచాయతీకీ చెందిన స్వచ్ఛ భారత్‌ ట్రాక్టర్‌ను టీడీపీ నేత గొంచిరెడ్డిపల్లి వన్నూరుస్వామి సొంతపనులకు వినియోగించుకున్నాడు. అంతే కాదు అదేదో తన సొంత వాహనం అయినట్లు ఇతరులకు అమ్మేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి నందినిని వివరణ కోరగా తాను ఇప్పటి వరకు సదరు ట్రాక్టర్‌నే చూడదలేదన్నారు. ఈ విషయం గురించి తననేమీ అడగవద్దని, ఏదైనా ఉంటే టీడీపీ మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు లేదంటే.. ట్రాక్టర్‌ను అమ్ముకున్నారని ప్రచారం జరుగుతున్న టీడీపీ నేత వన్నూరుస్వామినే అడగండి అని అంటున్నారు. ఇదిలా ఉండగా సంతేకొండాపురం గ్రామ పంచాయతీకి చెందిన స్వచ్ఛ భారత్‌ ట్రాక్టర్‌ను స్థానిక టీడీపీ నాయకుడు కళ్యాణదుర్గం మండలం మంగళకుంటకు చెందిన ఓ వ్యక్తికి అమ్మేశాడు. ఈ రెండు ట్రాక్టర్లు అమ్మేయటం వెనక ఓ టీడీపీ మండల స్థాయి నాయకుడి హస్తం ఉండటంతో అధికారులు మిన్నకుండిపోయారు. ఇటీవలే వాహనాలు అమ్మేసిన వాటాల్లో తేడాలు రావడంతో విభేదాలు తల్లెత్తి ఎమ్మెల్యే అమిలినేని కార్యాలయం అయిన ప్రజా వేదిక వద్దకు పంచాయితీ చేరిందని తెలిసింది.

ఆయన చెప్పిందే వేదం!

బ్రహ్మసముద్రం మండలంలో టీడీపీ మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు అండ్‌ టీం ఏం చెబితే అదే వేదంగా అధికారులు పాటిస్తున్నారు. బెలుగుప్ప మండల పరిషత్‌ కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న ఏకాంబరేశ్వరయ్యను బ్రహ్మసముద్రం ఎంపీడీఓగా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు చేపట్టడం పట్ల కూడా పలు రకాల అనుమానాలకు దారి తీస్తోంది. స్వచ్ఛ భారత ట్రాక్టర్ల మాయంపై ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓను ‘సాక్షి’ వివరణ కోరగా తమ దృష్టికీ ఏమీ రాలేదన్నారు. వస్తే.. చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

స్వచ్ఛ భారత్‌ ట్రాక్టర్లను అమ్మేసిన

టీడీపీ నేతలు

బ్రహ్మసముద్రం మండలంలోని

రెండు చోట్ల ఘటన

తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న

ఉన్నతాధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement