చిరు ప్రాయంలోనే ప్రేమలు..
పెళ్లి కాకుండానే యువతులు, బాలికలు గర్భం దాలుస్తున్నారు. మోసపోయామని గుర్తించేలోపు ఓ బిడ్డకు తల్లి అవుతున్నారు. ఇటీవల వెలుగు చూస్తున్న ఈ ఘటనలు ఆందోళన రేపుతున్నాయి.
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిధిలో ఇటీవల పెళ్లి కాకుండానే ప్రసవిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. విద్యార్థి దశలోనే ప్రేమలో పడుతున్న బాలికలు, యువతులు.. తాము మోసపోయామని గుర్తించేలోపు జరగరాని ఘోరాలు జరిగిపోతున్నాయి.
ఒకేరోజు ప్రసవించిన నలుగురు బాలికలు
దాదాపు తొమ్మిది నెలల క్రితం జిల్లా సర్వజనాస్పత్రిలో నలుగురు బాలికలు ఒకే రోజు ప్రసవించారు. ఈ నలుగురు నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. నలుగురూ ఉమ్మడి జిల్లా పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కస్తూర్భా గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న వారే. బాలికల అమాయకత్వం, ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకున్న కొందరు యువకులు వారిని లోబర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయా ఘటనల్లో కుటుంబ పరువుపోతుందని కేసుల నమోదుకు తల్లిదండ్రులు ముందుకు రాకపోవడంతో అసలు దోషులు తప్పించుకోని దర్జాగా తిరుగుతున్నారు.
న్యాయం ఏదీ?
శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న బాలికపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కీచకులు పలుమార్లు అత్యాచారం చేసి తల్లిని చేసిన ఘటన ఏడాది క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో దళిత బాలికకు నేటికీ ఎలాంటి న్యాయం చేకూరలేదు. టీడీపీ నాయకుల జోక్యంతో ఈ కేసు కాస్త పెడదారి పట్టింది. అసలు దోషులు బయటపడకుండా బాధితులను బెదిరించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అత్యాచారానికి గురైన దళిత బాలికకే న్యాయం జరగనప్పుడు తమ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందోనని పలువురు బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు సత్వర న్యాయం చేకూరుస్తూ దోషులకు కఠిన శిక్షలు పడితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పలువురు చెబుతున్నారు.
రెండేళ్లలో 100కు పైగా ఘటనలు..
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో జిల్లాలో టీడీపీ నేతలు సాగించిన అకృత్యాలకు వంద మందికి పైగా బాలికలు, యువతలు బలయ్యారు. ఇందులో కొన్ని మాత్రమే వెలుగు చూశాయి. వెలుగు చూడని ఘోరాలు ఎన్నో ఉన్నాయి. వెలుగు చూసిన వాటిలోనూ బాధితులకు సరైన న్యాయం చేకూరడం లేదు. టీడీపీ నేతల బెదిరింపుల కారణంగా బాధిత కుటుంబాలు గ్రామాలు వదిలి వెళ్లిపోయిన ఘటనలూ ఉన్నాయి. తాజాగా శనివారం రాత్రి మగబిడ్డను ప్రసవించిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని విషయమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికై నా ఈ తరహా కేసుల్లో దోషులకు సత్వర కఠిన శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకుంటారో.. లేదో వేచి చూడాలి.
పేదరికం కారణంగా సులువుగా మోసపోతున్న బాలికలు, యువతులు
శారీరక అవసరాలు తీర్చుకున్న తర్వాత ముఖం చాటేస్తున్న
యువకులు
కుటుంబ పరువు పోతుందని
కేసుల నమోదుకు ముందుకు రాని తల్లిదండ్రులు


