గుత్తి రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై టమాట లోడుతో వెళ్తున్న ఐచర్ అదుపు తప్పింది. అందులోని టమాట బాక్సులు పక్కనే వెళ్తున్న కారుపై పడటంతో 8 మందికి గాయాలయ్యాయి. ఎస్‌ఐ సురేష్ వివరాలమేరకు... అనంతపురం నుంచి హైదరాబాద్‌కు టమాటాల లోడుతో ఐచర్ బయలు దేరింది. అయితే శనివారం అర్ధరాత్రి కొత్తపేట గ్రామ శివారులో వేగంగా వెళ్తున్న ఐచర్ వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. అందులో ఉన్న టమాట బాక్సులు పక్కనే వెళ్తున్న కారుపై పడ్డాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న రాంభూపాల్‌రెడ్డి, బబిత, రమేష్, లక్ష్మిదేవి, గడివేములకు చెందిన ఆమనిలకు గాయాలయ్యాయి. వీరంతా నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు. ధర్మవరంలో పెళ్లి దుస్తులు కొనుగోలు చేసి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారుపై టమాట బాక్సులు పడి బెలూన్లు ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా రోడ్డుపై ఐచర్ అడ్డుగా పడి, పక్కనే నిలిచి ఉన్న కారును గమనించకుండా వేగంగా వచ్చిన మరో ఐచర్ వాహనం దగ్గరకు వచ్చాక అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఆ వాహనం కూడా కారును వెనుక నుంచి ఢీకొని అదుపు తప్పి బోల్తా పడింది. రోడ్డు ప్రమాదంలో రెండు ఐచర్ వాహనాలకు చెందిన ఐచర్ డ్రైవర్లు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రామ్‌సేవక్, విక్రమ్, థామ్ సింగ్‌లకు గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం గుత్తి ఆస్పత్రికి తరలించారు. కాగా రోడ్డుపై వాహనాలు అడ్డుగా పడటంతో సుమారు పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సురేష్ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


