గుంతకల్లు: పట్టణంలోని పాత గుంతకల్లు ప్రాంతం మస్తానయ్య నామస్మరణతో మార్మోగింది. హజరత్ మస్తాన్‌వలి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా అత్యంత కీలకమైన షంషీర్ ఊరేగింపు ఆదివారం వైభవంగా జరిగింది. వేకువజామున పుష్పాలతో అలకంరించిన షంషీర్‌ను గుర్రంపై కొలువుదీర్చి మేళా తాళాల మధ్య దర్గా నుంచి గణాచారిరెడ్డి కులస్తుల ఇంటి వరకూ ఊరే గింపుగా తీసుకువచ్చారు. సాజెదినాసేన్ (పుజారులు) ప్రత్యేక ప్రార్థనల అనంతరం తిరిగి దర్గాకు తీసుకువచ్చారు. వేలాది భక్తులు తర లిరావడంతో పాత గుంతకల్లు జనసంద్రమైంది. షంషీర్‌కు దారిపొడవునా బిందెలతో గుర్రం కాళ్లు కడుగుతూ భక్తిని చాటుకున్నారు. ఎండు కొబ్బరి కాల్చేందుకు భక్తులు ఎగబడ్డారు. మస్తానయ్య స్వామికి భక్తులు చక్కెర చదివింపులు, తులభారాలు, జంతు బలులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఇక జియారత్ కార్యక్రమంతో ఉత్సవాలు ముగిస్తాయని వక్ఫబోర్డు అధికారి రహీం, దర్గా కమిటీ సభ్యులు తెలిపారు.


