రాయదుర్గంటౌన్: పట్టణంలోని ప్రజలను తాగునీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాగునీరు అందించి ఆదుకోవాలంటూ మహిళలు ఖాళీ బిందెలతో తరచూ ఏదో ఒక ప్రాంతంలో ధర్నాలు, నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. తాజాగా ఆదివారం పట్టణంలోని కోతిగుట్ట, డ్రైవర్స్ కాలనీ వద్ద అనంతపురానికి వెళ్లే ప్రధాన రహదారిపై మహిళలు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేసి నిరసన తెలియజేశారు. వారం రోజులు గడిచిపోయినా కొళాయిలకు నీరు సరఫరా చేయకపోతే ఎలా ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు వదిలినా రాత్రిపూట వదులుతారని, అవి కూడా అరగంట పాటు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకోతో దాదాపు అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న నీటి సరఫరా విభాగం సిబ్బంది అక్కడికి చేరుకుని నీరు సక్రమంగా విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.


