రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
రాయదుర్గంటౌన్: రైలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన మేరకు... రాయదుర్గంలోని ముత్తరాసి ఇందిరమ్మ కాలనీ సమీపంలో నివాసముంటున్న రాముడు గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లి పట్టాలు దాటి వస్తున్న సమయంలో గూడ్స్ రైలు ఢీకొంది. ఘటనలో పట్టాల పక్కకు ఎగిరి పడిన రాముడుకు రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గుర్తించిన స్థానికులు, బంధువులు హుటాహుటిన రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తీసుకెళ్లారు. కాగా, రాముడు బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఓ కుమార్తె ఉంది.
గుండెపోటుతో ఏఆర్ ఎస్‌ఐ మృతి
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ ఎస్‌ఐగా పనిచేస్తున్న మహేశ్వరరెడ్డి బుధవారం గుండె పోటుతో మృతి చెందారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలానికి చెందిన ఆయన 1990లో ఏఆర్ విభాగంలో చేరారు. బుధవారం రాత్రి గుండెపోటుకు గురై కోలుకోలేక మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్పీ సతీష్‌కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియల నిమిత్తం వారి కుటుంబసభ్యులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. గురువారం అనంతపురంలోని రుద్రంపేట బైపాస్ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆర్‌ఐ వలి, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సూర్యకుమార్, అడహక్ కమిటీ సభ్యుడు త్రిలోక్‌నాథ్, సిబ్బంది షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో
మహిళ మృతి
కూడేరు: విద్యుత్ షాక్‌కు గురై ఓ మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు... కూడేరు మండలం ఉదిరిపికొండకు చెందిన రామాంజనమ్మ(40)కు ఇద్దరు కుమారులున్నారు. కొన్నేళ్ల క్రితమే భర్త ముత్యాలప్ప మృతి చెందాడు. వ్యవసాయ కూలి పనులతో పిల్లలను పోషించుకుంటూ వచ్చింది. ప్రస్తుతం పెద్ద కుమారుడు హరి పదో తరగతి పూర్తి చేసుకుని బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. రెండో కుమారుడు వేణు 8వ తరగతి చదువుతున్నాడు. ఉగాది సందర్భంగా గురువారం ఉదయం రామాంజనమ్మ స్నానానికని బాత్రూమ్‌లోకి వెళ్లింది. బకెట్‌లో నుంచి హీటర్ తీసే క్రమంలో ప్రమాదవశాత్తు షాక్‌కు గురైంది. ఎంత సేపటికి తల్లి బాత్రూమ్ నుంచి బయటకు రాకపోవంతో కుమారులు వెళ్లి పిలిచారు. లోపల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తలుపులు బద్ధలుగొట్టి లోపలకు వెళ్లారు. చేతిపై, కడుపుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న తల్లిని గమనించి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని పరీక్షించారు. అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించాడంతో కుమారుల వేదనకు అంతు లేకుండా పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఎల్లుట్లలో ఆగిన
చెన్నకేశవస్వామి ఉత్సవం
పుట్లూరు: మండలంలోని ఎల్లుట్ల గ్రామంలో ఏటా ఉగాది సందర్భంగా నిర్వహించే చెన్నకేశవస్వామి ఊరేగింపు ఈ సారి నిలిచిపోయింది. గురువారం నాడు ఉత్సవాన్ని నిర్వహించాల్సి ఉంది. ఇందు కోసం గ్రామస్తులు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా పల్లకీ మోసే వారితో పాటు డప్పు వాయిద్య కళాకారులకు భోజనం పెట్టే ఆనవాయితీని దేవదాయశాఖ అధికారులు ఆక్షేపించారు. దీంతో వివాదం నెలకొని ఉత్సవం ఆగిపోయింది. చెన్నకేశవస్వామి ఆలయానికి 28 ఎకరాల మాన్యం భూముల ద్వారా ఆదాయం ఉన్నా... దేవదాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతోనే సమస్య ఉత్పన్నమైనట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
హోరాహోరీగా
ఎడ్ల బండి పోటీలు
విడపనకల్లు: ఉగాది సందర్భంగా విడపనకల్లు మండలం హంచన్‌హాళ్ గ్రామంలో గురువారం నిర్వహించిన ఎడ్ల బండి పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీల్లో దాదాపు 10 జతల ఎద్దులు పాల్గొన్నాయి. ప్రథమ స్థానంలో ముస్తూరు లింగన్నకు చెందిన ఎద్దులు, ద్వితీయ స్థానంలో నాగేపల్లి రామచంద్రకు చెందిన ఎద్దులు, తృతీయ స్థానంలో నాగేపల్లి ఆంజనేయులు, నాల్గో స్థానంలో సురేష్, ఐదో స్థానంలో నాగేపల్లి శ్రీకాంత్ ఎద్దులు నిలిచాయి. విజేత ఎద్దుల యజమానుల ను అభినందిస్తూ నగదు పురస్కారాలతో సర్పంచ్ నాగేపల్లి కేశన్న, రాకెట్ల రమేష్, రాకెట్ల వన్నూరుస్వామి, గ్రామస్తులు సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు భీంరావు, వన్నూరుస్వామి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కర్రసాము పోటీలు
గార్లదిన్నె: ఉగాది పండుగ సందర్భంగా మండలంలోని పాత కల్లూరులో కర్రసాము, ఇరుసు పైకి ఎత్తే పోటీలు నిర్వహించారు. ఏటా గ్రామంలో యువకులకు గ్రామీణ క్రీడల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కర్రసాము, ఇరుసు ఎత్తే పోటీలు నిర్వహించారు. కర్రసాము పోటీల్లో ఆరుగురు పాల్గొనగా వారిలో వెంకటనరసింహ, శ్రీకర్ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవగా వారికి రూ.4 వేలు, రూ.3 వేల నగదు బహుమతి అందజేశారు. ఇరుసు పైకెత్తే పోటీల్లో ఆరుగురు పాల్గొనగా ఉప్పరపల్లి నారాయణ, నాగిరెడ్డిపల్లి రామానంద ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. వారికి రూ.6వేలు, రూ.3 వేల నగదు బహుమతి అంద జేశారు. జనం అధిక సంఖ్యలో తరలివచ్చి పోటీలను తిలకించారు.
నేడు కొటిపి చౌడేశ్వరీ దేవి రథోత్సవం
హిందూపురం: మండలంలోని కొటిపి గ్రామంలో వెలసిన చౌడేశ్వీరీదేవి అమ్మవారి రథోత్సవం శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు గురువారం వెల్లడించారు. ఏటా ఉగాది పండుగ సందర్భంగా మూలవిరాట్‌కు ప్రత్యేకపూజలు, ప్రాకార ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అలాగే మంగళ, శుక్రవారాల్లో రథోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 20న రథోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను గ్రామస్తులు పూర్తి చేశారు.
ఉరవకొండ: తల్లి ప్రేమకు భాష అక్కర్లేదని, పేగు బంధానికి మాటలు అవసరంలేదని ఓ మూగజీవి చాటింది. ప్రమాదంలో గాయపడిన తన బిడ్డను చూసి తల్లడిల్లుతూ కన్నీరు పెట్టిన ఓ గోమాత అందరినీ ఆశ్చర్య పరచింది. తన బిడ్డను ముద్దాడుతూ, కంటతడి పెడుతూ అక్కడే నిలిచిపోయింది. బిడ్డను వదల్లేక పోయింది. లేగదూడ చుట్టూ తిరుగుతూ విలపించిన తీరు చూసిన వారి హృదయాలు ద్రవించి పోయాయి. ఈ ఘటనతో కన్నపేగు బంధం మనుషులకే కాదు, జంతువులకూ అంతే బలంగా ఉంటుందనే విషయం మరోసారి స్పష్టమైంది. మానవ సంబంధాలు స్వార్థంతో నిండిపోతున్న ప్రస్తుత రోజుల్లో మూగజీవి ప్రేమ అచంచలమైనది అనే ఈ హృదయ విదారక దృశ్యం ఉరవకొండలో చోటు చేసుకుంది. గురువారం ఉదయం స్థానిక ఇందిరా నగర్‌లో రోడ్డు పక్కన ఉన్న ఓ దూడపై కారు దూసుకెళ్లింది. రెండు కాళ్ల మీద టైర్లు పోవడంతో దూడ తల్లడిల్లి పోయింది. ఈ విషయాన్ని గమనించిన అక్కడికి సమీపంలోనే ఉన్న తల్లి ఆవు వెంటనే పరుగెత్తుకుంటూ దూడను సమీపించి పైకి లేపేందుకు ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా దూడ పైకి లేవలేకపోవడంతో కన్నీరు పెట్టింది. గమనించిన మరికొన్ని ఆవులు సైతం అక్కడకు చేరుకుని దూడను పైకి లేపేందుకు చేసిన ప్రయత్నాలు చూసిన స్థానికులు ఒక్కసారిగా చలించిపోయారు. దూడకు నీళ్లు తాపించే ప్రయత్నం చేశారు. పశువైద్య సిబ్బందిని రప్పించి దూడకు చికిత్స చేయించారు.


